పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                      వేమన సంసార స్థితిగతులు   55

శంఖములోcబడిరాఁగా అప్పడా తీర్ధమును మనము భక్తితో నెత్తిపై ప్రోక్షించుకుని పవిత్రుల మగుదుము ! అది యట్లుండె,

రసవాదములో పరిశ్రమించినవారికి వైద్యము సహజముగా లభించును. " వాదభ్రష్టో వైద్యశేష్ట!' అనుమాట మీ రెఱుఁగుదురు. ఆట్లే వేమనకును కొంత వైద్యము వచ్చినట్లున్నది. కుక్క కఱచినందు కితని చికిత్స.

       "ఆ, కుక్కగఱచెనేని కూయనీయకపట్టి
             ప్రక్కవిఱుఁగఁదన్ని పండఁబెట్టి
             నిమ్మకాయదెచ్చి నెత్తిన రుద్ధిన
             కుక్క విషము దిగును కుదురు వేమ" (1116)

ఈ చికిత్సను దప్పించుకొనుటకైనను నా కెప్పడును కుక్క కఱవకుండ భైరవని ప్రార్ధింపవలసియున్నది! ఇదిగాక

             “భూమి క్రొత్తయైన భుక్తులు క్రొత్తలా" (634)
             "అంటనీయక శని వెంటఁ దిరుగు" (666)

అను నిట్టి కొన్నిమాటలచే వేమనకు కొంచెము జోస్యమును తెలిసినట్లున్నది. కాని యంతలోనే "జ్యోతిషము జనముల నీతులు దప్పించు" (2718) ననుకొని చాలించుకొన్నాఁడు.

ఈ రసవాదవిద్య నేర్చి వేమన్న యెంతయో నంపన్నుఁడయ్యెనని యూహింప వీలులేదు. ఈ విద్య ముఖ్యముగా విరక్తులగు బైరాగులవద్ద నుండును. దీని కొఱకై వేమన్న మొదలు కంసాలివారినిగూడ నాశ్రయించినట్లున్నది. వారు దొంగలని యెవరో తిట్టఁగా నిట్లు వాదించెను:

       "ఆ. కల్లలాడుదురిల కంసాలి దొంగని
             అతని సొమ్ము కెట్లు అతఁడు దొంగ !
             మన్ను బంగరుగను మఱిచేసి పెట్టఁడా ?..." (951)

కాని యితడాశ్రయించిన కంసాలిగురువు, సామాన్యముగ నిట్టి రసవాద గురువుల వలె, తుదకు ' దగా ' చేసెనేమో ! కావున కోపించి, విసిగి, 'కంసలికిని మించు కడజాతి లేదయా? (3194)) యని యా కులమునకే యొక తిట్టు తిట్టి తరువాత బైరాగుల నాశయించెను గాఁ బోలును. ఇతనికి గురువనఁబడు ' లంబికాశివయోగి ' ఈ తెగవాడే యనుకొనుచున్నాను. వీరి సేవచే వాదము వైద్యము వచ్చుటకు తోడు, వీరి సహవాసము వేమన్నజీవితమందే గొప్ప మార్పును గలిగించినది, దానిని గూర్చి ముందు విన్నవింతును.