పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 51

        "ఆ. ఇచ్చువానిచెంత నీయనివాఁడున్న
              చచ్చుఁగాని యీవి సాఁగ నీఁడు,
              కల్పతరువ క్రింద గ్రచ్చచెట్టున్నట్లు..." (347)

వేమన్న రోసినాఁడు. కాని కష్టపడువారిని జూచి మొగము త్రిప్పకొనిపోవు స్వభావ మతనికి సాధ్యముగాదు గావున, అడిగినవారి కప్పుడు తనవద్ద నేముండినను, ఎవరి దైనను, గమనింపక వెచ్చపెట్ట మొదలిడెను---

        "ఆ. ధైర్యయుతున కితర ధనమైన నెదురేమి?
             దానమిచ్చునపుడె తనకుఁ దక్కె,
             ఎలమి మించుపనికి నెవరేమి సేయుదు
             రడుగుదప్పఁ దప్పు బిడుగు వేమ" (2140)

అందుచే సన్మార్గమున పదార్థముగా వెచ్చింపని ధనవంతుని ధనమును వాని యనుమతి లేక మనము సత్కార్యమునకై సెలవచేసినను పాపములేదని యతఁడు నమ్మెను. మఱియు, నదియు నొక ధైర్యకృత్యముగా నతని రెడ్డిరక్తమునకుఁ దోఁచెను

       "ఆ, తనదు సొమ్ముఁజూడ దానమియ్యఁగ వచ్చు
             నవని దొడ్డగాద దెవరికైన
             అదరుబెదరు లేక యన్యుల సొమ్ముల
             దానమిచ్చువాఁడు దాత వేమ"* [1]

వేమన యిట్టి యౌదార్యబ్రాంతి ప్రవాహములోఁబడి యింకను చాలదూరము పోయినాడేమో యని భయపడవలసియున్నది. చూడుఁడు.

       "ఆ, ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
            నటలనైన సాహసముననైన
            సంపదవలన సాధించి ధనమును
            బడుగునకు నొసంగ బాగు వేమ" (2097)

సత్కార్యసాధనకై దుష్కార్యముతో ద్రవ్యమార్జించినవారు అరవలలో తిరుమంగ యాళ్వారును, తెలుఁగులలో గోలకొండ గోపన్నయు మనకు పరిచితులే, వేమన నిజముగా పై పద్యమున సూచింపఁబడిన దుర్మార్గమునకే చొచ్చియుండెనేని, అటు ద్రవ్యమార్జించి రాళ్ళురప్పలలోఁ బోసి గుడులు గట్టిన పై యిద్దఱికంటె, కూడులేక చచ్చువారిని పోషించుటకు వినియోగించిన యితనియందే యెక్కువ న్యాయమున్న దనుకొనవలసియున్నది.

కాని, వేమనవంటి విశుద్ధహృదయమునకు చాలనాళ్ళు ఇంటిపనులు గిట్టి యుండుట యసాధ్యము. విశుద్ధహృదయ మనఁగా దోషమే లేనిదని కాదు; కపటము.

  1. * దానమిచ్చు టేటి తగవొ వేమ' యని వే, సూ. " దానమివ్వరాదు ధరను వేమ యని • వేమన జ్ఞానమార్గ పద్యములు". కాని యిదే ప్రాఁతప్రతుల పాఠము, పద్యార్ధపుధాటిని జూచినను ఇట్లే తోఁచును, బ్రౌనుదొర యీ పాఠమునే అంగీకరించెను. కాని యీ పద్యములు వేమన్నవి గావేమో యని సందేహించెను (చూ, వావిళ్ళవారి బ్రౌను ప్రతి, పే. 161). కాని నాకా సందేహము లేదు. ప్రాచీనులు దుర్మార్గుల ధనము నపహరించి సన్మార్గమందు వెచ్చపెట్టవచ్చునని, వలయునని చెప్పిరి (చూ. మనుస్మృతి, 11 అధ్యా.శ్లో.19)