పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 43

వేమన యిట్టి సన్నివేశములలో పెరిగినవాఁడు. తనకాలపు పెద్దలు (వీరిలో తండ్రిగూడఁ జేరియుండును) బాహాటముగ గదికాలోలురైయుండుటను చూచి నాఁడు ; దేవాలయముల యుత్సవములలో, పెండ్లిపేరంటములలో వేశ్యల నాట్య మును జూచినాఁడు ; సంగీతమందాశ సహజముగాఁ గలవాఁడు కావున, వారి మధుర గానముచే పదనెక్కిన పచ్చిపదములను విని వాని యభినయమునుజూచి పరవశమై నాఁడు. ముద్దవయస్సు, ఐశ్వర్యము, అధికారముగల తనపై అవకాశము దొరికినప్ప డెల్ల వారు ప్రయోగించు కటాక్షపు కటారుల పోట్లు పడినాఁడు. ఇట్టివారికి లోపడుట అన్యాయమని అధర్మమని తాను పురాణములలో చదివిన చదువులు జ్ఞప్తికి వచ్చినవి. మనోనిగ్రహముచేయఁ బ్రయత్నించెనుగాని, తనకుఁ దానుదప్ప సహాయపడు వా రెవ్వరును లేకపోయినారు. చదువుకొన్నవారు పెద్దలు ఈ విషయమున తనకన్న దుర్బలులై యుండినారు. ఇఁక తా నెంతటివాడు ?

       "ఆ. ఆcడుదానిఁ జూడ, నర్ధంబుఁ జూడఁగ
            బ్రహ్మకైన నెత్తు రిమ్మ తెగులు..." (232)

అను సృష్టిసిద్ధమైన దోషము దెలిసికొన్నాఁడు. 'ఈ బుద్ధులు పాపకృత్యములైనచో ఇవి లేకయే బ్రహ్మ సృష్టిచేసి యుండరాదా?" యను ప్రశ్నకు ప్రత్యుత్తరము దొరకదయ్యెను. తుదకు మనపాపముల కన్నిటికి ఆ బ్రహ్మయే కారణమని ఈ "బ్రహ్మ యాలిత్రాడు బండిరేవునఁ ద్రెంప !? " అని యొక తిట్టుతిట్టి ప్రపంచ ప్రవాహములోఁ బడిపోయినాఁడు !

వేమన్న యిట్లు వేశ్యాలోలుఁడయ్యెనన్న వెంటనే అభిమానులు కొందఱు నాపై నాగ్రహింతురు. కాని యతనిమీఁది యభిమానమున నేను వారెవరికిని దీసి పోనని మాత్రము మనవి చేయవలసియున్నది. వేమననుగూర్చిన కథలలోనెల్ల నీ వేశ్యాసంబంధము కలదు. అతని యనుయాయులు, అతనినే దైవముగాఁ గొలుచు వారు, ఆందఱును దాని నాక్షేపింపక యంగీకరించినారు. కథలలోని విషయము లన్నియు అసత్యము లనుటకు నాకిష్టము లేదు. అత్యుక్తులను, ఇతర సాధనము లచే అసత్యములని స్పష్టముగా తేలినవానిని, వదలిపెట్టి తక్కినవాని నంగీకరించుట క్షేమము, న్యాయము. ఇఁక వేమనవంటి వేదాంతి వేశ్యచేఁజిక్కుట యసంభవమని తలఁచుట యజ్ఞానము. ప్రాఁతకాలపు సంఘస్వరూపమును గమనించిన యెవరికిఁ గాని, ఇట్టి విషయములలో తమదేశపు పుచ్చులన్నియుఁ గప్పిపెట్టి పాశ్చాత్యులు మనకు బోధించుచుండు తమలో లేని నీతిపద్ధతులు మన తాతముత్తాతలకు లేవనియు, వా రే న్యాయాన్యాయములను జేసినను తమంతచేసిరిగాని, యితరు లెవ్వరును వారికి మనకువలె వంకాయ పురాణములు" చెప్పలేదనియు న్పష్టమగును. కవికుల శిరోమణి సరస్వతి యవతారము, కాళిదాసు గణికాప్రియుఁడని మన ప్రాచీనులు తలఁచుచు నది యసంభవమని భావింపలేదు. అధర్మమని భావించి యుండవచ్చును. త్రివిధనాయికలలో రెండవది పరస్త్రీ, మూఁడవది వేశ్య! వారిద్దఱికిని రసికలాక్షణికు లందఱు స్వీయయగు మొదటియామెతోడ సమాన మర్యాదను కావ్య ప్రపపంచమున నొసఁగిరి, శ్రీనాథుని నైషధమును పంచకావ్యములలో పరిగణించిన వారే యతఁడు స్త్రీలోలుఁడనియు నెఱుఁగుదురు. ఇవన్నియు న్యాయములని నేఁ జెప్పరాలేదు. అది వేఱుమాట. మతిగొప్పవారందఱును అన్ని విధముల గొప్పవారే యని భావించుట, వారియెడ దోషము అసంభవ మనుకొనుట, మన యవివేకమునే వెల్లడించుననియే నా మతము. దోషములుండిన నష్టమేమి ? అందువలన కష్టము