పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 42

నాచరించుటగాక ఆచరించినట్లు చూపుకొనుట. ప్రాణాయామము చేయుటకు ముక్కు మూసికొనవలెను. రెండు(వేళ్ళతో ముక్కుపట్టుకొన్నఁ జాలును. దానిని మూసినావా తెఱినావా యని, ఊపిరి నిలిచినదా యాడుచున్నదా యని, సంధ్య వార్పెడు వారి ముక్కు లన్నియు పరీక్షించు మూర్ఖుడెవ్వఁడు? స్నానముచేయవలెనని దౌతవస్త్రమునే కట్టవలెనని శాస్త్ర మున్నది. దానికి ఒక చెంబెఁడునీళ్లు మీఁదఁ బోసికొన్నను, ఒకమాఱు నీటిలో నద్ది పిండి ఆరవేసిన వస్త్రమును గట్టుకొన్నను జాలును. ఆంతేకాని దేహమునందును, వస్త్రమందును పంచమైలలున్నను ఫరవా లేదు. ఇట్లు ఆశక్తిచేత, ఆజ్ఞానముచేత శాస్త్రములన్నియు 'శాస్త్రము'నకై పోయినవి. వేషము ప్రధానమైనది. కావున మనుష్యసంఘమందు ప్రధానములైన రాజ్యము, మతము, ధర్మము అను మూఁటినిగూర్చి యెవరును ఎక్కువగా చింతించి, ఊహించి, చర్చించి నిర్ణయింపవలసినపనిలేదయ్యెను. ఇఁక నీతి మనచేతిది. మనలను దండించువాఁడు కల్గువఱకును మనము చేసినదే నీతి, కా(బట్టి ప్రజలు ప్రాయికముగ స్వేచ్ఛావర్తనులైరి. విషయవాంఛలు అడ్డులేక ప్రబలెను. రాముని యేకపత్నీవ్రతముకంటె కృష్ణుని యనాది బ్రహ్మచారిత్వము అనుకూలముగాc దోఁచెను. బహుపత్నీ కత్వము భరింపరాని బరువు. కావున వేశ్యల వ్యాపారము ఎప్పటికన్న నెక్కువయయ్యెను. ఊరూరను కనీస మొక దేవాలయము, దేవన కొక దాసి చాలినను భక్తులకు చాలకపోయెను. ఇక ఇరుగుపొరుగిండ్ల సహవాసము మొదటినుండి అన్ని మతములవారును, దేశములవారును ఖండించినది. మఱియు, ఆ యిండ్లలో వట్టి యాఁడువారు మాత్రమే కాక వారి భర్తలు మొదలగు మగవారు వుండుటయు, వారికిని తమవలెనే మానాభిమానములుండుటయు కొంచెము నిదా నించి యూలోచింపవలసిన విషయము.

        "ఆ. పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు,
              అరయు నిందలకును నాలయంబు,
              పురుషుఁడు వినఁజంపు, భూపతి నొప్పించు, విశ్వ." ( 2450)

కావున వేశ్యాసంఘాభివృద్ధి కావలసివచ్చెను. వారికి మర్యాదలు, పెండ్ల పేరంటములలో సంభావనలు ప్రబలినవి. కాని వారిసంఖ్య యాకస్మికముగా పెరుగుట కష్టము. దేవదాసీలవలె సంఘదాసీలగు బసివిరాండ్రను బయలుదేర్చవలసి వచ్చెను. శైవులలోను, వైష్ణవులలోను సంఘయజమానులే దానికి నమ్మతించిరి. ఇది గాక నిత్యమును సంసారులుగానుండి సంతలలో మాత్రము వేశ్యావృత్తి నవలంబించు *సంతబస్వి'రాండ్రు కొందఱు కావలసివచ్చెను. చాలనందుకు దొమ్మరీండ్ర వేశ్యలు. కొంత క్షేమము గలిగెను. పరస్త్రీ సంగమమువలె వేశ్యాసహవాసమును పాపకర్మములని ధర్మశాస్త్రములున్నను, ఈ విషయమై చర్చలు జరిపి సిద్ధాంతముచేయు తొందఱ లేకుండ, మొదటికన్న రెండవది మేలనియు, ఆది పాపమే కాదనియు, ఐనను క్షమింపఁదగినదనియు, జనులందఱును పరస్పర హృదయ సంవాదముచే నిర్ణ యించుకొనిరి. నియమపరాయణు లెవరైననున్న వారిలో ననేకులకు వీరియెడల ననహ్యముకన్న అసూయయే యొక్కువయై, పైకి ఖండించినను, లోలోన గ్రుక్కిళ్లు మింగుచుండిరి. క్రమముగా ఏకపత్నీవ్రతము పురుషలక్షణమే కాదనుకొనఁ జొచ్చిరి. వ్యభిచారము చిన్నవారియందే కాని పెద్దవారియం దంత దోషముగాదని చెప్పకొనిరి. పూర్వకాలపు వృద్ధులలో ననేకుల కిప్పటికిని ఈ భావము లిట్లే యున్న వని మన మెఱుఁగుదుము.