పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                     వేమన సంసార స్థితిగతులు 41

            కట్టెలోన నగ్ని పట్టిన విధమున
            పుట్టి మెట్టవలెను భువిని వేమ" (2539)

అని దృఢ సంకల్పము చిన్ననాటనే యితని కుండియుండవలెను. ఇట్టి సంకల్పము లనేకులకుఁ గలవు. ముప్రాద్దును మంచముమీఁదనే పరుండి, ముల్లోకముల యాధిపత్యమును సంపాదించు సంకల్పములు చేయువారము మన మందఱమును. దానికిఁ గావలసిన శక్తియుక్తులట్లుండఁగా ముఖ్యమైన పట్టుదలయే యన లనేకుల కుండదు. వేమన్నకు మసస్పునఁ గలిగిన సంకల్పమును నిర్వహించు దార్ఢ్యము మొదటినుండి కలదనవచ్చును—

       "ఆ, పట్టి విడువరాదు పదిలక్షలకునైన" (2352)

       "ఆ. ఊఁపcబోయి కొంత యూఁగించి విడిచిన
            నూఁగుఁగాని గమ్య మొందలేఁడు
            పట్టు పూన్కికొలఁది పనిచేయు లక్ష్యంబు, విశ్వ" (559)

      “ఆ. పట్టుపట్టరాదు పట్టి విడువఁగరాదు
           పట్టెనేని బిగియఁ బట్టవలయు
           పట్టువిడుటకన్న పడిచచ్చుటయె మేలు, విశ్వ" (2758)

అచ్చపు రెడ్ల రాజనము ! ఇది గలవానికి దేవుఁడే లొంగి యతఁడు పట్టినపని. నిర్వహించి యిచ్చి తంటా తప్పించుకొనును. ఇట్లు దృఢసంకల్పముచేయు స్వభావము గలిగినను, ఏది పట్టవలెనో, ఏది విడువవలేనో నిర్ణయించుకొను. వివేకము అనుభవముచేతనో, అనుమానముచేతనో సంపాదించుకొనఁగల్గుటకు ముందు వేరొక ప్రబలమైనమార్పు వేమనజీవితమందుఁ గలిగినది.

అదే దనఁగా, యౌవనము. చిన్నయసూరి చెప్పిన 'కలిమి, దొరతనము, అరయమి' యను తక్కిన మూఁడును కొంతకుఁ గొంత కలవని మనమెరిగి యున్నాము. ఇట్లు సర్వసాధన సంపూర్ణమైన యావ్వనము స్వచ్ఛందముగా ప్రవర్తించుటకు వలసిన సమయనందర్భములకును ఆ కాలమందు కొదవలేదు.

పదునెనిమిదవ శతకమునాఁటి హిందువులకు రాజ్యకార్యనిర్వాహములు, శాస్త్రతత్త్వ విచారములు మొదలగు తీవ్రవిషయములందు ప్రతిభాబలము ప్రవహించుట నిలిచినది. 'ఎవరికివారే యమునాతీరే' యన్నట్లు స్వతంత్రులగుట కందఱును తమశక్తికొలఁదిఁ బ్రయత్నించిరి. సామ్రాజ్యస్థాపనకు శ్రద్ధతోఁ బ్రయత్నించినవారు లేరైరి. ఉన్నవారికి శక్తిలేదయ్యెను. రాజులు నవాబు లనఁబడు వారికిని తమ సెలవలకు ద్రవ్యము నార్జించుటయే ప్రధానోద్దేశముగా నుండెను. ప్రజలగతి యెట్లైనను పన్నులు వసూలైనఁ జాలును. కాబట్టి బలవంతుఁడు. ప్రబలుఁడై ప్రభుత్వము చెలాయించెను. ప్రజలు "సర్కారు వారికో, లేక "రెడ్డిగారికో యీయవలసిన దిచ్చిరేని తరువాత తక్కిన విషయములందు వారిని దండించుదాత గాని, మర్ధించు మామగాని లేకుండెను. ఇఁక చదువుసంధ్యలు నేర్చి సాంఘిక వర్తనముల నియమించు బ్రాహ్మణులు మొదలగు సంఘాధిపతులకు మతము, శాస్త్రము, ధర్మము—ఇవన్నియు సిద్ధములైన వస్తువులు. తమ ప్రాచీనుల పుస్తకములలో నన్నియుఁ గలవు. వానిని నేర్చుకొనుట, శక్తియున్న నవియే సత్యములని స్థాపించుట, యింతకన్న వేఱుచేయవలసిన పనిలేదు. అవి యుక్తములా కాదా యని సందేహించుటయే మహాపాతకము! వానిని తప్పక యాచరించిన ముక్తి సిద్ధము! సామాన్యజనులందిట్టి మనోభావమునకు పరిణామ మేది? సహజముగా