పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 34

నొక యాఁడుబిడ్డను వివాహము చేయక వదలుట కొందఱు వీరశైవులలో నిప్పటికిని గలదు. వారు వ్యభిచార వృత్తిచే జీవింతురు. వారికిని 'బసివి' యను పేరు సమాన ధర్మముచే వచ్చినది. తాతాచార్యులవారి వైష్ణవము రాకమునుపు ఈ దేశమందును ఆ పద్దతి యుండి యుండును. దానిని పూర్తిగాఁ ద్రోసివేయలేక కాఁబోలు, వైష్ణవ గురువులు, శిష్యులలో బసివిరాండ్రకు భస్మరుద్రాక్షలకు బదులుగా తిరుమణి తులసి పూనలనిచ్చి, దాసర్లగుంపులో వారిని జేర్చినారు. క్రమముగా బసివిరాండ్రను తయారుచేయుటకుఁ గూడ గురువులవారి యాజ్ఞ కావలసివచ్చినది. ఇట్లు గురువుగారి యనుమతిచే దాసీత్వమును వహించిన వైష్ణవ బసివిరాండ్రు ఈదేశపు 'నామధారుల'లో నెందఱో కలరు. వీరొక విధముగా పల్లెటూరి వేశ్యలు. ఇక్కడ తప్ప ఇత రాంధ్రదేశములలో వీరి పేరు వినరాదు. కావున వేమన్న పేర్కొనిన బసివి రాండ్రు శైవులైనను, వైష్ణవులైనను వారి పరిచయ మతని కీదేశమందే కలిగి యుండు ననుకొనుచున్నాను.

ఇఁక నేయితర స్థలములందుఁగాని వేమన వసించినట్లు ఇంతకంటె ప్రబలము లైన సాధనములుండెనేని, యవి నాకు తెలిసిన వెంటనే, అవశ్యముగా ఆ యూరికి విచ్చేయుమని, వేమన్నను పల్లకీలో మోసి యక్కడికి సా(గసంపుటకు నేను మొదటి బోయిలాగా నిలుతును.

వెనుకనే చెప్పవలసిన వేఱొక్క విషయమును మఱిచితిని. ఇప్పడు విన్న వింతును. వేమన్న కాలజ్ఞానమును వ్రాసెనఁట ! కాలజ్ఞానమనఁగా భూతమును భవిష్యత్తుగాఁ జెప్పట ! జరిగిన దానిని జరుగఁబోవనదిగా చెప్పి తన కాలమును త్రానే వెనుక కీడ్చుకొనుట ! పురాణములలోని భవిష్యద్రాజ వర్ణనమిట్టిదే. వ్యాసులే యీ పద్ధతికి ప్రథమాచార్యుఁడు గా(బోలు. అతఁడు ఇతర పురాణములలో వ్రాసిన చిల్లర భవిష్యత్తుకు తృప్తిపడక భవిష్యత్పురాణమని దానికే వేఱుపురాణమును వ్రాసినాఁడు. అనఁగా వ్రాయుచున్నాడు ! దానిలో సృష్టి మొదటినుండి మొన్న ఇంగ్లీషువారు రాజ్యమునకు వచ్చువఱకు భవిష్యత్తు చెప్పి, చిరంజీవిని గదా, తక్కినది నిదానముగా వ్రాసికొందమని కా(బోలు, ప్రకృతము విశ్రాంతి ననుభచించు చున్నాఁడు. కర్ణాటక శైవులలో నిట్టి కాలజ్ఞానములు వ్రాయుట యెక్కువ. బనవేశ్వరుఁడు మొదలగు వారెల్ల తలకొకటి వ్రాసినవారే. వేమనవంటివాఁడైన సర్వజ్ఞుని పేర నొకటి గలదు. తెనుఁగులో పోతలూరి వీరబ్రహ్మము మొదలగు వారి పేర నిట్టివి గలవు. కావున ఆ గుంపునకే చేరిన వేమన్నగూడ నొకటి వ్రాసి యుండిన నుండును. వ్రాయకుండినను శిష్యులలో నెవఁడో వ్యాసమహర్షి గరుసేవ చేయుటకై యతని పేరుపెట్టి వ్రాసియుండును. కాని యాగ్రంథము నేఁజూడలేదు. అందులోనిదే కాఁబోలు నీపద్యము.

      " క. నందన సంవత్సరమునఁ
           బొందుగ కార్తీక శుద్ధ పన్నమనాఁడీ,
           వింధ్యాద్రి సేతుబంధన సందున
           నొకవీరు(డేలు చాటరవేమా." ( 2151)

ఇది వేమన్న తన్నుఁగూర్చి చెప్పకొని యుండుననియు, కావున ఆతఁడా తేదీలో పుట్టి యుండవచ్చుననియు, 'ఏలు" సనఁగా మత ప్రచారముచే నేలినవాఁడనియు, నొక యూహ (వం, సు, వేమన, పు. 43). ఇట్టిదే మఱియొక పద్యమును గలదు :