పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                        వేమన కాల దేశములు 23

కొండవీటిలోఁ బుట్టి కొన్నాళ్ళుండి, తరువాత ఆ రెంటిలో నేదోయొక పల్లెలో మొదటి యింట వసించినాఁడను నర్థమిచ్చు పాఠాంతర మొకటి పై పద్యమున కుండవలె ననుకొంటిమేని, ఇతఁడు కొండవీటిలోఁ బుట్టినాఁడు కాఁడని సాక్షాత్ర్పమాణము లభించువఱకును మనమతఁ డందుబుట్టినవాఁడే యని నమ్మదముగాక! ఈ నమ్మికకు తోడు కర్నూలు జిల్లా క్రిష్టిపాడు వాఁడనియు, గుంటూరికిఁ జేరిన 'ఇను కొండ" వాఁడనియు, కడప మండలపు 'చిట్టివేలు" వాఁడనియును బ్రౌనుదొరవిస్న యుపపురాణములు కనీసము మూఁడున్నవని మనము గమనింపవలసి యున్నది.*[1]

ఇఁక నితఁడు కటార్లపల్లెలోవచ్చి సమాధి యయ్యెనాయను విషయమింకను సందిగ్ధము. ఇదివఱకు వేమన పద్యముల నచ్చువేసినవా రనేకులు ఇతఁడు కదిరి తాలూకా కటార్లపల్లెలో శార్వరి సంవత్సర చైత్రశుక్ల నవమినాడు తన జీవితమును చాలించెననియే వ్రాసియున్నారు. 'క్యాంబెలు దొరయును ఇట్లేతలఁచి కటార్లపల్లెకుఁ బోయి చూచి యక్కడిసన్నివేశములు గుట్టలు వాఁగులు మొదలగువానిని విపులముగా వర్ణించి వ్రాసెను.†[2] బ్రౌనుదొరకు కటార్లపల్లె సమాచారమే తెలిసినట్లు తో(పదు. నేనును ప్రత్యక్షముగా నాయా ప్రదేశములను చూచి రావలయునని పోయితిని.‡[3] కాంబెలు దొరకన్న మనముగా విపులముగా మీకు వర్ణించి చెప్పవలెనను కుతూ హలముతో త్రోవలోని తుమ్మచెట్లు, పాపాసుకళ్ళి, రాళ్ళ రప్పలగూడ వదలక గుర్తులు వేసికొంటిని. మొదలు కదిరి దగ్గరనుండు "నల్లచెరువు' గ్రామము నందును వేమన్నకు సంబంధము గలదని విని యక్కడికిఁబోయి యందలి గుడి దర్శించి యందలి వేమన్న చెక్క విగ్రహము మొగమున పట్టినామములు చూడఁ గనే శిపయోగియైన వేమన్న ముగమున నామా లేమిటిరా? యుని సందేహము కలిగినది. కాని యహింసావ్రతియైన వేమన్నపేర నేటేట నెనుఁబోతుల బలియిచ్చి నట్లే, యిదియు విచిత్ర కాలపరిణామములలోనొకటియై యుండుననుకొని, యక్కడి పూజారి చెన్నయ్యను విచారింపఁగా, నాతఁ డొక వేమన్నపురాణమును జెప్పెను. అదంతయు మీ కేకరువు పెట్టదలఁచుకోలేదు. కాని విధిలేక ముఖ్యాంశములు మాత్రము సూచించుచున్నాను

వేమన కొండవీటివాఁడు. పైఁడిపాలకొడిది రెడ్లవంశమువాఁడు. కనుగోళ్ళ గోత్రము. మొద లితనిపేరు పుల్లారెడ్డి, రాజైన యన్నతో కలహించి తల్లితో నల్ల చెరువుకు వచ్చెను. అక్కడ సేద్యము చేసుకొనుచు సుఖముండఁగా నొకనాఁడు త్రోవలో నతని తలపై పిడుగుపడి నిర్జీవఁడాయెను. తరువాతి కార్యము జరుప నక్కడివారు ప్రయత్నింపఁగా తల్లికి స్వప్నమందతఁడు గాన్పించి 'ఇ(క నేడునాళ్ళు సహింపుఁడు. మరల నేను జీవింతును" అని చెప్పెనఁట. అట్లే యెనిమిదవ దినమున సజీవుఁడై "ఏమి పుల్లారెడ్డి ! ఎట్లు ఏడునాళ్ళు చచ్చి బ్రతికితివి?" అని యక్కడివా రడుగఁగాఁ 'నా పేరు పుల్లారెడ్డి కాదురా, వేమన' యని చెప్పెన(ట. అది మొదలు మహాత్ముఁడై శిష్యపరివారముతోఁ దూర్పుదేశము తిరిగి యనేక మహత్త్వములను

 1. *See Brown's Verses of Vemana, Preface, p. III.
 2. † See Mad. Chris. Coll. Mag., March' 1898
 3. ‡ఈ ప్రయాణమందు మన్మిత్రులు శ్రీ అనంతపురపు వార్తకవి రామచంద్రరాపు, బి.ఏ. బి.ఎల్. గారును, కదిరి వసంతాచార్యులుగారు, రెడ్డిపల్లి వెంకటశ్రేష్టిగారును నాకు చేసిన సాహాయ్యము ఎన్నఁడు మఱవరానిది.