పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

వేమన

మన వేమన్న యనియు వ్రాయఁబడినది. కాని రాచవేమారెడ్డి నాలుగేండ్లు రాజ్య మేలెననియు తుద కాకస్మికముగా తన భృత్యునిచేతనే చంపఁబడియె ననియు " కొండవీటి దండకవిలె'లోఁ " గలదంట. కాబట్టి ప్రకృతస్థితిలో కొండవీటి రెడ్డిరాజు లకును వేమన్నకును సంబంధము గలదని యూహించుట దుష్కరము.

మఱియు, అంతరంగసాక్ష్యములచేత నీ యంశము దృఢమగును. వేమన ప్రబంధకవులవలె తానుండు ప్రపంచమును దాఁటి వ్రాసినవాఁడు కాఁడు. అతని పద్యములందెల్ల స్వానుభవమును కవితాధర్మము తాండవ మాడుచుండును. ఇతఁ డాగర్భశ్రీమంతుఁడై నడిమివయసువఱకును రాచనగరియందె పెరిగినవాఁడై యుండిన, పెద్దన్న, కృష్ణదేవరాయలు మొదలగువారి కవిత్వమందుఁ గానవచ్చు సంపత్సమృద్ధివాసన యిందెందును గానరాక పోవునా ? వానియం దభిమానము లేకున్నను ఖండించుటకైన పనికిరావా? మఱియు, వేమన్న "కుక్క యిల్లు సొచ్చి కుండలు వెతకుట" చూచినాడు (3227). ' పండిన చేనులోని పల్లేరుగాయలు ' తొక్కినాడు (2602). 'గడ్డివేసినను పోట్లగొడ్డు కొమ్మాడించు'నని యెఱింగినాడు (1744) 'పచ్చికుండలో నీళ్ళు పట్టిన నిలుపవని " కనుగొన్నాఁడు (1347). 'కుండ చిల్లిపడిన గుడ్డ దో(పగవచ్చు నను సంసారవు నాజూకును నేర్చుకొన్నాఁడు (1132). "కడుపునిండ తవుడు గంపలోఁబెట్టక, చన్ను ముట్టనీదు కొన్న బఱ్ఱె" యను మహిషీదోహనమర్మమును చదువుకొన్నాఁడు (851). ఇట్టి యనుభవములు రాజవంశీయులకు, అందును రాచరికపు జవాబుదారీ లేక యూరక తిని తిరుగమరగిన యువరాజులకు కలుగునా ? మఱియు, వేమన --

        " ఆ. ఎంత సేవఁజేసి యేపాటుపడినను
               రాచమూక నమ్మరాదు రన్న !
              పాము తోడి పొందు పదివేలకైనను, విశ్వ" (638)

అని చెప్పినవాఁడు. ఇంత పైన ' రాచకొడుకు గాకున్నను దూరబంధువై, బీదవాఁడై మైసూరుదేశమందలి కొందఱు 'అరసు'లపలె నేల యుండరాదు?" అని తలఁచు వారుండిరేని నా యాక్షేపణలేదు ; వారికి ఫలమును లేదు.

ఇట్టితఁడు రెడ్డిరాజుల వంశమువాఁడై యుండఁడని సందేహముగలిగిన వెంటనే, వారు రాజ్యముచేసిన 14-15 శతాబ్దములలో నున్నవాఁడను కాలమును నిరాధార మగుచున్నది.

ఇఁక కొండవీటిలో పట్టి పెరిగినాఁడనుటకు వేమన పద్యములలో నొక యాధారమున్నది :

           "ఆ. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమవీధి
                 మూగచింతపల్లె మొదటి యిల్లు
                 ఎడ్డెరెడ్డికులమదేమని తెల్పుదు విశ్వ." (568)

కాని దీని యర్ధము సందిగ్ధము. కొండవీటి పశ్చిమవీధిలో నునికికిని మూగచింతపల్లె మొదటి యింటికిని సంబందమేమి ? దీని కంతరార్ధమేమో గలదంట. పాఠాంతరము లకును కరవు లేదు. అవి యట్లుండనిండు. కొండవీటివద్ద మూగచింతలపల్లె కలదఁట. కడపజిల్లాలోకూడ నొక మూగచింతపల్లె కలదనియు, నందలి వారొకబయలు చూపి యిదే వేమన్న పుచ్చకాయలు పండించిన చేనని చూపెదరనియుఁ జెప్పఁగా విన్నాను.

[1]

  1. చూ. అం. భా. 3, పు 193