పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
14
వేమన

విధములుగా నర్థము చెప్పిరి—(1) విశ్వమును ప్రపంచమును ఇచ్చువాఁడు 'విశ్వ దుcడు' = భగవంతుఁడు; అతనికి అభిరాముఁడు = ప్రీతిపాత్రుఁడు—అనియొకరు. (2) విశ్వమును = నమస్తమును, ద = ఇచ్చుటచేత, ఆభిరాముఁడు—అని యింకొకరు. (3)వేమన్న ఉంపుడుకత్తె 'విశ్వద ' యని నామకరణముచేసి, దానికబిరాముఁ డని వేరొకరు. (4) విశ్వమును సంహరించువాఁడు విశ్వదుఁడు = శివుఁడు, అతనికి ప్రియుఁడని మఱియొకరు (చూ, వం. ను. గారి "వేమన', పే.194). ఇన్నిటికి తోడు నాదియు నొక వ్యాఖ్యానముండిన నష్టమేమియనుకొని నేను, అసలీ పాఠమే తప్పని, "విశ్వతాభిరామయను పాఠమునే గ్రహించి 'విశ్వతా = ప్రపంచత్వముఅనఁగా, సర్వమును తానైయుండుట—దానిచే నభిరాముఁడు" అను నొక యర్థము బైలుదీసియుంటిని (చూ. వావిళ్ళవారి ప్రతి, పీఠిక. పుట XVIII). శ్రీ వంగూరి సుబ్బారావుగారు, 'విశ్వదుఁడు = సమస్తము నిచ్చినవాఁడు (అనఁగా, త్యజించిన వాఁడని కాఁబోలు) అగుటచే నభిరాముఁడు" అని వాడుకలోనున్న యస్త్రమే యుచిత మనిరి. ఎవరి వాడుకలో నీ యుర్ధమున్నదో యెఱుఁగను. వేమన్న పద్యములు పఠించువారందఱును ఈ నాల్గవపాదము 'తందనానతానా" వంటిదని తలఁచి యూరకున్నవారే కాని, దాని యర్ధము విచారించినవా రరుదు. పోనిండు. నా వ్యాఖ్యానమే నా కిప్పుడనుచితముగాఁ దోఁచినది. ఎందుకనఁగా: అప్పడు తానే సమస్తమును అను అద్వైతానుభవస్థితి కలిగిన తరువాతనే యితఁడు పద్యములు వ్రాయ మొదలుపెట్టెనని చెప్పవలసివచ్చును. వేమన స్వచ్ఛందచారిగను, సంసారి గాను ఉన్నప్పడు వ్రాసినవని యూహింపవలసిన పద్యము లనేకములు గలవు. ఈ విషయము ముందు స్పష్టమగును. కనుక "విశ్వతాభిరామ పాఠమును, దానికి నాయర్థమును వదలుకొనవలసియున్నాను. మనలొ వ్యాఖ్యానము వస్తుస్థితిని జెప్పుటకుఁ గాక, తమతమ శక్తిని జూపు వినోదముగా నేర్పడినది గావున ఆ పద్ధతి ప్రకారము దీని కింకొక యుర్ధముగూడ నిష్టమున్నవారు చెప్పుకొనవచ్చును : విశ్వ దుఁడు=ప్రపంచమున నందఱిని ఖండించినవాడు, అగుటచే నభిరాముఁడు.- అనఁగా, అన్ని జాతులను, వారి పద్ధతులను జంకు లేక ఖండించిన వాడగుటచే, ఆందఱును తముఁ దిట్టిన పదములను మరిచియో, మఱుఁగుపఱిచియో, యితరులను దిట్టినది మాత్రము చెప్పుకొని సంతోషింతురు. కావున నితఁడందఱికిని అభిరాముడే ! ఇట్టి టీకల కేమిలెండు. సహజమైన యర్ధము దీని కిదివఱకు లభింపలేదు. ఇఁక ముందు లభించునను నాశయు నాకు లేదు. దీని కర్థమే లేదనుకొని యింతటితో నూరకుండుట క్షేమము. ఉన్నంతలో మొదటిది మేలు.

ఇఁక నిందుకు సంబంధించిన అభిరామయ్య కథ కాళ్ళులేనిది. ఈకథ తెలిపెడు పద్యములు బందరు వారి ముద్రణములో గలవు. అది వేమన స్వకీయ చరిత్రమును వ్రాసినట్లున్నవి. నేను జూచిన యే వ్రాఁతప్రతులందును ఇదివఱకు అభి రామయ్య పేరైన కానరాదు. వ్రాఁతయచ్చుప్రతులల పీఠికలో నితని కథ సంగ్ర హముగా(గలదు. అసలు అభిరామయ్య యను పేరె వింత పేరు. రామయ్యలు గలరు, పట్టాభిరామయ్యలు గలరు; లోకాభిరామయ్యలును ఉండవచ్చును, కాని వట్టి యభిరామయ్య కర్థమేమి ? ఒకవేళ పై పేరులలో నేదోయొకటి వాడుకలో నిట్లు సంగ్రహింపఁబడినదనుకొన్నను 'విశ్వదాభిరామ పదమున కర్థమేమి? విశ్వదుఁడనఁగా, విశ్వము నిచ్చినవాఁడు-అనఁగా-చేసినవాఁడు-అనఁగా విశ్వకర్మ అనఁగా, అతని కులమునకుఁ జేరినవాఁడు-ఐన అభిరామయ్య యని యర్థమా ?