పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

వేమన

ఇట్లే " ఉత్తమాంశమూని యున్మనిలోఁజేరి' అనుచోట, 'ఉన్మని' యర్ధము కాక కాఁబోలు 'ఊని యున్మహిలోఁజేరి' అని ముద్రింపఁబడినది (504). "వేఁడు బట్టు వాని వినయంబు లధికంబు" అని యుండఁగా 'పేడుముట్టెవాని' యని యర్థములేని సవరణగలదు (2907), 'నూనెలేక దివ్వె నూలిచే (దారముచే) వెల్గునా" యనునది నువ్వులచే వెల్గునా' యని మార్పఁబడినది (944). కాని వట్టి నూవులుదంచి నడుమ వత్తిఁబెట్టినను దివ్వె మండుననుట యాఁడువారికందరికిని దెలియును. ఇట్టివనేకములు. ఇఁక 'బాలవ్యాకరణము', 'అప్పకవీయము" మొదలగు వానిదెబ్బలకు వేమన పద్యములెంత నలినులియైనవో చెప్పితీఱదు. తక్కినవారిమాట యట్లుండనిండు. బ్రౌను దొరయే 'గృహము గూడుఁ జేసి గుణము వత్తిగఁ జేసి', ' గూబ యెక్కినట్టి గృహము పాడుగఁ జేసి' యను పద్యములలో యతి చెడెనేయని, " గృహము"ను 'గురము"నుగా ముద్రించి, క్రింది టీకలో

'గురము'; ఇది గృహశబ్దము యొక్క అశాస్త్రీయమైన తద్భవము. దీనిని వేమన యొక్కఁడే యుపయోగించిన వాఁడని తలఁచెదను."

(Brown's Verses of Vemana, p. 113)

అని ఇంగ్లీషున వ్రాసెను. లేనితద్భవమును గల్పించి యంటఁ గట్టుటకంటె యతియే కొంత దారి తప్పిన దనుకొన్న నష్టమేమి ?

వ్రాఁతకాండ్ర తప్పల నట్లుంచి మూలమునే కొంతవఱకు సూక్ష్మముగా బరీక్షించితిమేని, వేమన్న కచ్చితముగా నేనియమమునకును లోబడినవాఁడు కాఁడని స్పష్టమగును. విసంధులు, వ్యవహారమందలి కొన్ని భాషా రూపములు, సామాన్య మైన పద్యపు నడకకు నష్టమురాని ఛందోభంగములు—ఇత్యాదుల నతఁడు గమ నించిన వాఁడు కాఁడు. అసలు గమనింపఁ గల్గినంత చదువు చదువుకొన్నవాఁడే కాఁడని సందేహింపవలసి యున్నది. కావున 'కల్లు కిచ్చునట్లు చల్లకీయఁగ లేరు" ఇత్యాదులలో అపశబ్ద బ్రాంతిచే 'కల్లున కిడునట్లు' (1010) ఇత్యాదిగా దిద్దుట వేమన శైలిని ధ్వంసము చేయుటయే. తెలియ నీదు మాయ దీనిల్లుపాడాయ' అను దానిని 'పాడాయె' (314) అనియును 'ఉత్తమపురుషుండు ఒక్కడు చాలదా? అను దానిని 'పురుషుఁడటు లొక్కఁడు చాలఁడా" యనియను (2401), ఆధునికులు చేసిన సవరణలు, స్వచ్ఛందముగా పరువెత్తుబిడ్డల కాళ్ళకు సంకెళ్ళు తగిలించుట వంటివి.

ఇదిగాక వేమనయే మనకర్థము గానట్లు వ్రాసిన పద్యములనేకములు గలవు. ముఖ్యముగా తత్త్వవిషయములను దెలుపు పద్యములు చాలవరకు దుర్బోధ ములు, సామాన్యముగా తత్త్వశాస్త్ర విషయముల నెఱుఁగని నావంటి వాని కా శాస్త్ర పరిభాషాపదము లర్థము గాకపోవుట సహజము. కాని, అందఱెఱిఁగిన పదార్థము లకే మాఱు పేరులు పెట్టి వ్రాసినప్పడా చిక్కును వదలించుట సామాన్యకార్యము గాదు. బ్రహ్మరంధ్రమందలి సహస్రారచక్రమునకు 'నంది దుర్గ మని పేరుపెట్టిన నెవరు దానిని భేదింపఁ గల్లుదురు? (2155) ఇట్లు మఱుగు పఱిచి వ్రాయుట వేదముల కాలమునుండి కలదు. చూడుఁడు---

              “ద్వా సుపర్ణా నయుజా సఖాయా
               సమానం వృక్షం పరిషస్వజాతే
               తయో రన్యః పిప్పలం స్వాద్వత్తి
               అన్న న్నన్యోఆభిచాక శీతి? (ముండకోపనిషత్తు, 3-1-1)