పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

వేమన

              "తే. శ్రీకరుండగు వేమన చెప్పినట్టి
                    పద్యముల నెవ్వఁడేనియ పఠనచేయు
                    నట్టిపురుషుఁడు మనమున నిట్టిదనుచుఁ
                    జెప్పరానట్టి వస్తువుఁ జేరు వేమ" (3747)

అను పద్యమువంటివి గొన్ని పద్యములున్నవి కాని యవి గ్రంథాంత మందలి  ఫలశ్రుతి పద్యములే యని చెప్పటకు తగిన సాధనములు లేవు. గ్రంథము సమగ్రముగా లభించువఱకును ఈ పద్యములు --- 

                   “వేదాతీతుఁడు వేమన సుమ్మీ
                    వేమన వాక్యము వేదము సుమ్మీ ?? (3637)

ఇత్యాది పద్యములవలె, సమయమువచ్చినప్ప డాత్మప్రశంసకై యతఁడే చెప్పినవో, లేక, తరువాతి భక్తులు చేర్చినవో యగుననియే మనము నమ్మవలసియున్నది. బందరువారు ముద్రించిన ' వేమనసూ క్తిరత్నాకరము' లో అతఁడు తన చరిత్రమును వ్రాసికొన్నట్లుండు పద్యములు నాకుఁ జూడఁగా వేమనవిగావు. ఇదివఱకున్న యనేక ముద్రణములలోఁగాని, బ్రౌనుదొర సంపాదించిపెట్టిన సుమారు ఏఁబది వ్రాఁత ప్రతులలోఁ గాని యవిలేవు.

మఱియు తా నిన్ని పద్యములు వ్రాసితినన్న జ్ఞానమే వేమనకుండెనని నేను నమ్మను. 'శతనంఖ్య పద్మము' లని (3680) యొకచోట, 'వేయి పద్యంబు' లని (3652) మఱియొకచోట, 'వేయు నేనూఱుపద్యము' లని యింకొకచోట *[1] 'పదియునైదువేల పద్యములని’ (వేదాంతసిద్ధాంతము, ప. 3) వేరొకచోటఁ గాన వచ్చుచున్నది! ఇందులో నేది నిజము ? నాకుఁ జూఁడగా వేమన యేనంఖ్యయు నెఱుఁగఁ డనుటయే నిజము. అచ్చైన ప్రతులలో నాలుగువేలకు మీఁదుగా పద్యములు గలవు. బ్రౌనుదొర సంపాదించిన ప్రతులలో నిన్నిలేవు గాని అచ్చు ప్రతులలో లేని పద్యము లనేకములందుఁ గలవు. కావున వేమన యొక శతకము, సహస్రము అను సంఖ్యానియమమునకు లోబడక స్వతంత్రముగా నవకాశము వచ్చి నపుడెల్ల పద్యములు చెప్పినవాఁడనియు, వానిని విన్నవారిలో నభిమానము గలవా రప్పుడప్పుడు గుర్తువేయుచు వచ్చిరనియు, ఆతనికి తరువాతఁ గొందఱు గురుభక్తితో నతని పద్యములన్నియుఁ జేర్చి కూర్పఁ బ్రయత్నించిరనియు నమ్మట క్షేమము, ప్రక్షేపములు చేర్చువారి కింతకన్న మంచి యవకాశ మెందు లభించును? ఇతని పద్యములలో ప్రక్షేపము లెక్కువయుండవని యొకమాఱు తలఁచితిని, కాని యిటీవల నాకాభావము కొంతవఱకును మాఱినది.†[2] ఆన్ని ప్రతులకంటె నెక్కువ పద్యములు గలిగి, విశ్వకర్మ వంశీయులగు బందరు పూర్ణయా చారిగారు ప్రకటించిన ప్రతిలో, తక్కిన యేచోటను లేనివి, విశ్వకర్మను బొగడి వ్రాసిన పద్యము లనేకములు గలవు.

ప్రక్షేపముల పాపమట్లుండఁగా దానికిఁ దోడు తిద్దు(బాట్లతొందఱ యొకటి యున్నది. ప్రయాస: మొదటినుండి వేమన పద్యములు వ్రాసిన వారందఱును అవ్యుత్పన్నులే, భక్తియున్నంత జ్ఞానముగలవారరుదు. కాని తమకుఁ దెలియని

  1. * ఈ పద్యము శ్రీ వంగూరి సుబ్బరావుగారు తమ 'వేమన' గ్రంథములో నుదాహరించిరి. పే. 116.
  2. †చూ, వావిళ్ళవారి కడపటి ముద్రణపు పీఠిక.