పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కవిత్వము, హాస్యము, నీతులు 113

వలసినదే. కాని అంతమాత్రమున దేహము పైభాగము ముఱికి ముద్దయై చీర పేలు పడి క్రుళ్లుచున్నను తొందఱ లేదన వచ్చునా ? ఇతరుల కసహ్యమనుట మఱచి పోదముగాక ! మన ముక్కుకే యది యోర్వవచ్చునా ? ఒక వేళ అట్లోర్చు కొనుట బలవంతముగా వాడుక చేసికొని బహిరింద్రియములను చంపుకొన వచ్చును గాని నిజముగా నది యుక్తమనవచ్చునా? కావున ఈ రెంటిని పరస్పరసహాయ ములుగాఁ జేసికొనుట బుద్ధిమంతుని లక్షణము మాత్రమే కాదు; సమర్ధుని లక్షణము గూడ.

వేమన యిట్టి తప్పుసిద్ధాంతమును కొంతవఱకును కవిత్వమునందును ఉపయోగించెను. కవిత్వమునకు భాష, చంధస్సు మొదలగునవి బహిరంగములు. అర్ధభావములంతరంగములు, అవి ఒక విశిష్ట విధముగా తీవ్రముగా నున్ననే కాని కవిత్వమను పేరురాదు. చూడుఁడు :

               "ఆ. పైరు నిడిన వాని ఫలమే సఫలమగు,
                     పైరు నిడనివాఁడు ఫలము గనునె ?
                     పైరు నిడని చాఁడు బహుసౌఖ్యవంతు(డౌ..." (2613)

ఈ పద్యమందు కవిత్వములేదు. వేమన్న యిది వ్రాయకుండినను నష్టము లేదు. అట్లే బహిరంగములైన భాషాఛందస్సులును ఒక విశిష్టవిధముగా నుండనిది కవిత్వమను పేరు రాదు. చక్కనిభాష, కుంటులేని ఛందస్సు గలిగియున్నను ఆంధ్రనామ సంగ్రహము సందు కవిత్వమెట్లులేదో, యట్లే అర్ధభావములు మంచి వైనను భాషాఛందస్సులు నాగరకతనుదప్పి యుండుటచేత నీక్రింది పద్యము నందును అదిలేదు :

               "వక్కుతండములైన పూదించి నలగొట్టి
                వకటిగా జేయొచ్చు వసుధలోన
                ఆత్మవేఱైన వెనుక అంటించుటకుదురా..విశ్వ." -
                                         కో. లక్ష్మణ మొదల్యారు గారి వేమనపద్యములు (2862)

వేమన యీ పద్యము నిట్లే వ్రాసెనో వ్రాయలేదో యనుమాటవేఱు. అతని పద్యములనేకములు వ్రాఁతప్రతులలోను అచ్చుప్రతులలోను నిట్లేయున్నవి. అనేక పద్యములందు ఆటవేలఁది నడకకును, సీసపునడకకును భేదమే యితఁడు గమనించినట్లు తో(పదు. భాషావిషయమందును శుద్ధమైన శబ్దప్రయోగమునకుఁగాని, సంధులను చక్కఁగా కలుపుటకుఁగాని, యితఁడు ప్రత్యేకముగ పరిశ్రమించినట్లే తో(పదు. అచ్చులకును 'హాకార 'య'కారములకును గల భేదమును పలుమాఱీతఁడు గమనింపలేదు. 'సమశివయనపచ్చు నారాయణనవచ్చు' (2159) ఇత్యాది నిరర్గళ ప్రయోగములు పెక్కులు గలవు. ఇక అసభ్యములగు పదములు, అర్ధములు లెక్కలేనివి.

ఇఁక సామాన్య ప్రజకు బహిరంగము ముఖ్యము. దేవళ్లపగోపురముల యెత్తు, దేవతకుఁగలనవరత్నాల సొమ్ములు, పూజారి మెడలోని తావళములసంఖ్య మొదలగు వానినిజూచి వానిమాహాత్మ్యమును వీనిభ క్తిని నిర్ణయించువారు వారు. ఇట్లు కవి వ్రాసిన పద్యములు గూడ శుద్ధమైనభాష, పందెపు గుఱ్ఱము నడకవంటి ఛందస్సుఁ గలిగి, అనుప్రాస యమ కాదులతో సభామందిరమును గడగడలాడించు నిట్లున్నది బలే యని మెచ్చుకొందురు. వేమనకవిత్వమందది యొక్కడిది?

మఱియు సామాన్యముగ కవిత్వమును విని సంతోషించు ప్రజలు రెండు