పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 112

ఇట్టి కవిత్వమును వ్రాసి ప్రఖ్యాతిని సంపాదించుట వేమనవంటి వారికి రుచించునా ? చూచిన వస్తువులందెల్ల తప్పలుపట్టు స్వభావము గలవాఁడు, పట్టిన తప్పలను స్పష్టముగా మొగము ముందర చెప్పక యుండలేనివాఁడు, ఇతరులను కీర్తికొఱకో, ద్రవ్యముకొఱకో ఊరక యెట్లు పొగడఁగలఁడు? ఒకని యందలి గుణ ములు తన మనసుకు నచ్చిన పక్షమున నంతోషించి పద్యములు వ్రాయు స్వభావము వేమన్నకు కలదని, గుంటుపల్లి ముత్తమంత్రి మీఁది పద్యము తెలుపుచున్నది. కాని ఆది, 'మా వాఁడు బుద్ధిమంతుడు' అని వాత్సల్యముతోఁ జెప్ప అభిమానపు మాట వలెనే యున్నదే కాని, యందులో ప్రపంచమందలి యందఱి తలవెండ్రుకలను తెలుపు చేయునట్టు ముత్తమంత్రి కీర్తి వర్ణింపఁబడినదా? లోకుల కెవరికిని త్రాగుటకు నీరును లేనట్లు, తెచ్చి పోసిన యతని దాన ధార వర్ణింపఁబడినదా? కాబట్టి యీ పద్యమును నెఱదాత యగు గుంటుపల్లి ముత్తమంత్రియే వినియున్నను, వేమన్న కొక గోటువక్కయు నిచ్చి యుండఁడు. తన దరిద్రావస్థలో ద్రవ్యార్జనకొఱకు బైలుదేఱినప్పడు ఇట్లు ధనికులను పొగడి వేమన్నయు పద్యములు వ్రాసినాఁడేమో యను నందేహమును గలిగించు పద్య మొకటి గలదు

               "ఆ. పడుచు నిచ్చువానిఁ బద్య మిచ్చినవాని
                     కడుపు చల్లఁజేసి గౌరవమున
                     నడపలేనివాఁడు..." (2375)

తక్కినది మీరు పుస్తకమందే చదువుకొనుఁడు. కాని, యీ పద్యముగూడ, ఇట్లు ద్రవ్యము కొఱకు తన యాత్మను జంపకొనియైన ముఖస్తుతిచేసి పద్యములు వ్రాసిన వానిపైఁగూడ *అయ్యోపాపము' లేక, వట్టి చేతులతో పంపించు 'బండగోవ" లను తిట్టి వేమన వ్రాసినదే యనియుఁజెప్పవచ్చును. ఇట్లగుటచే ఇతఁడు ఇతరుల కేది రుచించునని గమనించి, యాప్రకారము వ్రాయఁగల్గుట యసంభవము.

ఇదిగాక యితఁడు సహజముగా బహిరంగద్వేషి. అనఁగా దేని యందైనను ముఖ్యముగ గమనింపఁ దగినది. సారభూతమైన లోపలితత్త్వమే గాని, బైటి యాకారము, వేషము, పని మొదలగునవి కావనుట యితని సామాన్యదృష్టి. మనస్సు శుద్ధముగా నున్నఁ జాలును; బైటి స్నానపానాదు లక్కరలేదనువాఁడు. తాను గట్టిన 'చిఱుగుబట్ట' యే చీనాంబర మని, తన "ముఱికి యొడలే' 'ము క్తి' యని చెప్పచు, ఆక్షేపించినవారి నదరఁ గొట్టిన వాఁడు. 'భక్తిలేని పూజ ఫలము లేదు? గావున, అదికలవాఁడు దేవళములకుఁబోయి, పత్రి, తులసి కర్చుపెట్ట వలసిన పనిలేక 'మంచాననే మ్రొక్కు ( 2328) నని చెప్పినవాఁడు కాని మంచము నందైనను 'మ్రొక్కుట' తప్పనిది గదా ! అది బహిరంగమేకదా ? బహిరంగము అంతరంగము రెండును ఒకటికొకటి యనుకూలములే కాని ప్రతి గూలములు కావు. బలవంతముగా వానిని వేఱుపఱుప వచ్చునే కాని సహజముగా ఆ రెండును అన్యోన్యాశ్రయములు ; ఒకటినొకటి వదలనివి. భక్తిలేక పూజచేయ వచ్చును; పూజలేక భక్తియు సాధ్యమే ; కాని సహజముగాదు. అంతరంగము తనకు సంబంధించినది. బహిరంగము పరులకే యెక్కువగాఁ జేరినది; అనఁగా, తనకును అందు సంబంధము లేకపోలేదు. దానము చేయవలయునని యంతరంగ మందు బుద్దియున్నఁ జాలునా ! బహిరంగముగా చేయకున్న నితరులకు ఫలము లేదనుమాట యట్లండనిండు. అసలు తనకు తృప్తి కలుగునా ? హృదయము నిర్మలముగా నుండవలసినదే. కడుపులో అజీర్ణాదిమలములు లేకుండఁ జేసికొన