పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                          వేమన   110

ఫలమైన యద్వైతము లభించుననియు, నమ్మునట్లు తా నాచరించి చూపి, విజ్ఞానధనులైన వివేకానందుని వంటి వారి ననేకులను లౌకిక వైదికులను శిష్యులనుగాఁ జేసికొని, వారి మూలమున హిందూమత శాస్త్రముల ఘనతను యూరోపు, అమెరికా మున్నగు ఖండాంతరములందును చాటింపఁ జేయఁగల్గెను! ఇతని మతప్రకారము అద్వైతమే ప్రధానతత్త్వమని చెప్పటకుఁగాని, ఖండించు టకుఁ గాని, నాకు శక్తిలేదని మొదలే విన్నవించితిని గదా? అదియెట్లున్నను, దేశమున కితఁ డనుగ్రహించిన గొప్పయుపదేశము : భిన్నమతములవారు ఒకరొకరితో కలహింప నక్కరలేదనుట. ఏ మతము నాశ్రయించినను ఫల మొకటియే కావున వారి వారి నంప్రదాయమునకు, ఇష్టమునకు తగిన మతము ననుసరింపవచ్చును. బహిఃప్రపంచమున శాంతిదాంతులుగలిగి, పరోపకారము, అనాథ సేవ చేయుటయే పరమధర్మమని యితఁడు బోధించెను. సంఘసంస్కారము, మతసంస్కారము అను పేరుతో జాతిభేదములు, విగ్రహారాధన మొదలగు వానినెల్ల నొకటేమాఱు మూలముట్టుగ నశింపఁజేయఁ బ్రయత్నించుట పిచ్చిపని ; ఆవియొకచోట నడంచిన వేరొకచోట, ఒకరూపమును పాడుచేసిన వేఱొకరూపమున పైకిలేచును; దయ, దాక్షిణ్యము, భక్తి, నమ్మిక మొదలగు నుదారగుణములు ప్రజలలో పెంపొం దించినచో పై జాతిభేదాదులు తమంతట తమ బలమును గోలుపోవును. కావున వాని నడంచుటయందుఁగాని, స్థాపించుటయందుఁగాని శ్రద్ధవహింపక యుదా సీనముగా నుండుట యావశ్యకము. చండాలస్పర్శ చేసిన 'నాజన్మమే చెడిపోయెను, నేను ముక్తికి దూరుఁడనైతిని, అని నిష్కల్మషముగా నమ్మినవానిని బలవంతముగాc బట్టితెచ్చి మాలపల్లి మధ్యలో నిలిపినను, తిరుపతికిఁ బోయి దేవునికి 'పొంగలి సేవార్ధము చేయించిన నాకు ముక్తి లభించునని దృఢముగా నమ్మి తిరిపెమెత్తి కర్చుకు సంపాదించుకొని కాళ్ళనొప్పలు గమనింపక కొండయొక్కి పరమానందముతో దేవుని దర్శించి “ధన్యుఁడైతిని గదా" యని కన్నీళ్ళు రాల్చువానికి 'ఇది వట్టి రాతిబొమ్మరా, దేవఁడును గాదు, దయ్యమును గాదు. దీని కేల మొక్కెదవు?" అని యెంత చెప్పిసను, నీటి కెదురీదినట్లగును గాని ఫలము లేదు, వారి మనస్సు నెమ్మదిని జెఱిచినట్లగునింతె. ఒక అభిప్రాయం మనసులో స్థిరముగా నిలుచుట కెన్నాళ్ళు పట్టునో, దానిని పోఁగొట్టుకొనుట కంతకన్న నెక్కువ పట్టను-ఈ తత్త్వములను రామకృష్ణపరమహంసుని వలె, నే నెఱిఁగినంతవఱకును, ఇతర బోధకులెవరును గమనింపలేదు. ఈ జాతిభేదము మొదలగునవన్నియు త్రానును తుదిలో వదలినవాఁడే. కాని యితరుల నట్లుచేయుమని నిర్బంధించి తిట్టలేదు. నిర్బంధములతోను, దూషణలతోను శ్రద్ధ జనింపఁజేయుట యసాధ్యమనియు, అనావశ్యకమనియు ఖండించి యుపదేశించువానికన్న మౌనముతో నాచరించువాఁడు మంచి సంస్కర్తయనియు నీతఁ డెఱిఁగెను. బలవంతపు మాఘస్నానముతో పుణ్యము వచ్చునేమో కాని చలి విడువదుగదా !*[1]

 1. * పై రామకృష్ణపరమహంసుని జీవితచరిత్రవిషయములు 'The Life of Sree Ramakrishna' అను గ్రంథము నుండి సంగ్రహింపఁబడినవి,