పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                      వేమన వంటివారు 103

నూయాదు లున్నను, నిరర్థకకర్మములు, దంభాచారములు మొదలగు మతవాదుల దుర్గుణములపై కత్తిగట్టుటలో వీరందఱును చాల పనిచేసినవారు. పామరజనులలో నేఁటికిని నిష్కల్మష భక్తి, నమ్మకము, సౌశీల్యము మొదలగు గుణములు నిలిచి యుండుటకు వీరే కారణభూతులు గాని, సూత్రములు, భాష్యములు, వ్యాఖ్యలు వాసిన పండితులు గారు,

తిరువళ్ళువరు

మన యింకొక పొరుగింటివారగు అరవవారిలో చాలవ్యాప్తిఁగాంచిన తిరువళ్ళువరు నాయనారి 'తిరుక్కురళ్ అను గ్రంథముతో వేమన పద్యములను పోల్చి చూడవలయుననుట ప్రకృతోపన్యాసనిబంధనలలో నొకటి. కాని యిరువురికిని పోలికలు చాల తక్కువ. నాకు ధ్రవిడభాషాజ్ఞాన మంతకంటె తక్కువ. కాని తెలిసిసంతలో అతనినిగూర్చి కొంత సంగ్రహముగా విన్నవింతును.

తిరువళ్ళువరు చాల ప్రాచీనుఁడు. ఇతనికాలము క్రీస్తుశకపు మొదటి శతక మని యనేకులు తలఁచినారు. మద్రాసులోని మైలాపూరిలోనున్న వాఁడు. 'భగ వంతుఁడను బ్రాహ్మణునికి 'ఆది' యను చండాల స్త్రీకిని జనించిన వాడని కథ* [1]వళ్ళువరనువారు ఒక తెగమాదిగలే కావున ఇతని పేరు పైకథలోఁ గొంత సత్య మున్నదని సూచించెడిని. ఇతని నిజమైన పేరేమో తెలియదు, నేఁతపని వృత్తిగా బ్రతికినవాఁడు. ఇతని భార్య వాసుకి. వీరిరువురి దాంపత్యము అపూర్వమై చాల సౌఖ్యావహమై యుండెడిదంట.

ఇతఁడు వ్రాసిన గ్రంథము కురళ్ . '" కురల్డ్ " అనఁగా ఒకవిధమగు చిన్న( ఛందస్సు : ఆటవెలఁదిలో ఇంచుమించు సగముండును. ఇతని పద్యములన్నియు ఆ ఛందస్సులో నున్నవి. ఇది ధర్మము, అర్థము, కామము అను మూఁడు పురు షార్ధములనుగూర్చి మూఁడు భాగములుగా వాయఁబడిన యుపదేశ శాస్త్రము. తాను బ్రాహ్మణుఁడు గాకపోవుటచే నధికారములేదని యితఁడు మోక్షమునుగూర్చి వ్రాయక వదలెననికథ, కాని ఉపోద్ఘాతమందలి పద్యములలోను, సన్న్యాసధర్మ ప్రకరణమునందును, భగవంతునిగూర్చియు, మోక్షోపాయములను గూర్చియు, సంగ్రహముగానైనను వ్రాసియే యున్నాడుఁ గావున ఆ కథ మనము నమ్మఁబని లేదు. మఱియు ఇతcడు సుఖియైన సంసారిగానుండి, గృహస్థధర్మములగు అతిథిపూజ మొదలగునవి జరుపు కర్మనిష్టుడై, సత్యము, నీతి మొదలగు సామాన్య లౌకిక ధర్మముల నెక్కువ శ్రద్ధతో నెఱపుచు, దృఢమైన దైవభక్తిగలవాఁడై యున్న వాఁడంతేకాని వేదాంతవిషయముల నెక్కువగా పరిశీలించినవాఁడు కాకపోవచ్చును. ఇతఁడు పై ధర్మార్థకామములో నొక్కొక్కదాని యంగములను ప్రత్యేకముగా విభాగించి ప్రతివిషయమునకు పది పద్యముల ప్రకారము మొత్తము (1330) పద్య ములు వ్రాసెను. గ్రంథకర్త యొక్క విషయ విభాగ శక్తిని సూక్ష్మదృష్టిని ఇందుఁ జూడవచ్చును.దీనికి తోడు చక్కని కవితాశక్తియుఁ గలదు. అనఁగా వేమన్నవంటి యాశుధారగాదు. తిక్కసవలె నెమ్మదిగ చెక్కి చిక్కఁగఁ దీర్చిన రచన యితనిది.

 1. * 'కురళ్' తెనుగగు ‘త్రివర్గదీపిక' పీఠికలలో, అత్యద్భుతములైన గాథలు ఇతనిని గూర్చి కలవు కాని యది శుద్ధ పురాణము,