పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 89

వేమన వీనిని వానినుండియే గ్రహించి యుండవచ్చును. హఠయోగమును వామాచార తాంత్రికులు తక్కిన వారికంటె నెక్కువ యుపయోగించుకొన్నవారు కావున వారి గ్రంథములు కొన్ని యితఁడు చూచియుండిన నుండవచ్చును. అంతే కాని యితఁడె తంత్రమార్గమునుగాని నేరుగా నవలంబించి యుండెనని నేను నమ్మఁ జాలకున్నాను. ఇతని సిద్ధాంత మద్వైతము ; సాధనకు హఠయోగమూలమగు రాజయోగము. హఠసాధనవేళలో కొన్ని తాంత్రిక మార్గముల నాశ్రయించిన నుండవచ్చును. అందును 'వజ్రోళి' మొదలగు అసహ్యసాధన లితఁడు చేసి నాఁడని నేనమ్మను.

ఇట్లు జీవన్ముక్తిమార్గమును తానెఱిఁగి యది ప్రజలకు బోధించుటకై యితఁ డనేకదేశములు తిరిగినట్లు తోఁచెడిని. కాని యేయేచోట్ల సంచరించెనో స్పష్టముగాc జెప్పలేను. తంజాపూరిరాజు లా కాలములో వేమన్నను తమవద్ద నుంచుకొని బంగారు చేయు విద్య నేర్వవలయు ననునాశతో పూజించుచున్నట్లు వాడుక కల చని శ్రీ వంగూరి సుబ్బారావుగారు వ్రాసిరి. (వం.సు. వేమన, ప. 198). ఇప్పటి కిని ఆక్కడ వేమన్న పటము కలదను విషయము మొదలే విన్నవించితిఁగదా. ఇట్లు పోయినచోట నెల్ల మత విషయములు, సాంఘిక దురాచారములు, సామాన్య నీతులు ఇత్యావ విషయములనుగూర్చి పద్యములుచెప్పి బోధించుచు, ఎక్కడ నేది దొరికిన నది భుజించి యవకాశము దొరికసప్పడెల్ల పరమాత్మ చింతచేయుచు, ఇల్లు, వాకిలి, సంసారము అన్నియు వదిలి తిరుగుచు కాలక్షేపముఁ జేసినవాఁడు.

           "క, పరమాత్ముని చింతనలోఁ
                దఱచుగ నుండుటయె తగును ధన నాఁకటికిన్
                దిరిపెము నెత్తి భుజించుచు
                దొరవలె గృహవేదికందుఁ దొంగుము వేమా" (2445)

ఇతని బోధసల నెందరో వినక తిరస్కరించిరనుటలో నాశ్చర్యము లేదు. అసలతని మతసిద్ధాంతములు చదువుకొన్నవారికే యర్ధము గానివి. వానియం దేమేని సత్యముగలదేని యది యితనిపలెనే కష్టపడి దేహమును మనస్సును దండించిస వానికి తప్ప ఇతరుల కనుభవమునకు రాదు. కంటికి కానవచ్చు నదంతయు మాయ యనియు సత్యము వేఱే కలదనియుఁ జెప్పిన నెందఱికి నమ్మిక కలుగును? దేవుఁడనఁగా అందఱి కంటె గొప్పవాఁడని, సర్వశక్తిగల వాఁడని, కోరిన దిచ్చువాఁడని, నమ్మినవారికి-తమకు సర్వ విషములందునుగల యశక్తి నెఁఱిగిన వారికి-నేనే దేవుడను భావము ఎట్లుగలుగును? మఱియు నితని యందలి గొప్ప కష్టము మత సంబంధములగు బహిరంగములైన రూపములును క్రియలును పూర్తిగా ఖండించుట. దానిని వదలుట మనుష్య స్వభాపమునకే విరుద్ధము. ఉద్దేశమెంత మంచిదైనను, గొప్పదైనను దానికి తగిన బహిరంగ స్వరూపము లేనిది మనుష్యులలో మర్యాద గలుగదు. దేవుఁడు లేఁడని యూరకయైన నుండ గలరే కాని ఉన్నాఁడని నమ్మినప్పడు తమ బహిరిందియములకు తృప్తిగా పూజోత్స వాదులు నడుపకుండుట యెవరికిని సాధ్యముగాదు. ఆధ్యాత్మిక ప్రపంచమున వీనికి వెలయుస్నను లేకున్నను ఆధిభౌతిక ప్రపంచమున ఇవి లేనిది బ్రదుకుట కష్టము ఇది గాక, ఈ బహిరంగములందే మనుష్యునికి సహజమైన కళా ప్రియత్వమునకు తృప్తి కలుగును. కావుననే వేషములను కర్మములను నిందించిన వారెవ్వరుగాని సఫల మనోరథులు గాలేదు. అట్లుండ, అవన్నియు వదలి ముక్కుమీఁద దృష్టి