పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము 9

"పరస్పర మిత్రములై యెప్పడును ఒకటినొకటి వీడని రెండు పక్షులు ఒక రావిచెట్టును గౌగలించికొనియుండును. వానిలో నొకటి తీయనియామ్రాని పండ్లను దినును. మఱొక్కటి తినక చూచుచుండును? అని యర్థము. ఒకటే సంసార మందు జీవాత్మ పరమాత్మ లిరువురును ఎడతెగక యుందురనియు, పుణ్యపాప ఫలములను జీవుఁడు భుజించుచుండఁగా పరమాత్మ యూరక నిర్లేపుఁడై చూచు చుండు ననియును భావము. వేమన్నదాఁకఁగూడ నీనంప్రదాయము దిగి వచ్చినది :

        " ఆ, నీరు కార మాయె కారంబు నీరాయొ
              కారమైన నీరు కారమాయె
              కారమందు నీరు కడు రమ్యమై యుండు" (2267)

ఇది నాకర్థము కాలేదు. మఱియు దీనికి దిక్కులేనన్ని పాఠాంతరములున్నవి. దేనికేమి యర్ధమో ! ఇట్టివి లెక్కలేనన్ని. ఇట్లగుటచే వేమన పద్యముల కన్నిటికిని కొద్దిగనో గొప్పగనో గూడార్థము గలదను నొక యభిప్రాయము బైలుదేఱినది. చూడుఁడు

       " ఆ. చెప్పు లోనిరాయి, చెవిలోని జోరీగ,
              కంటిలోని నలుసు, కాలిముల్లు,
              ఇంటిలోని పోరు ఇంతంత గాదయూ
              విశ్వదాభిరామ వినర వేమ. " (1430)

ఇందులో తెలుఁగు వారికి తెలియనిదేమున్నది? కాని, ఉన్నదని సంప్రదాయజ్ఞలనఁ బడువారు గంభీరముఖముతో ప్రత్యుత్తరమిత్తురు. మనలో సకలదుర్వ్యాఖ్యాన ములకును ఆధారము సంప్రదాయము. 'ఇందులో నేమోయంతరార్ధమున్నట్టున్నది' అని బ్రౌను దొరగూడ మొుగముముడివేసుకొని వ్రాసెను*. [1] కాలము, చెడినది గాని, లేకున్న శిష్యుఁడు దీని రహస్యార్ధము దెలుసుకొనవలెనన్న గురుపేవ కనీసము పండ్రెండేండ్లయినను జేయవలసి యుండును. కాని అచ్చు వచ్చి గురువులవారి గుట్టు చెఱచినది. దమ్మిడికి తరముగాని దీని యంతరార్థమును శ్రీ వంగూరు సుబ్బారావుగారు సంగ్రహించి ప్రకటించిరి. † [2] కుతూహలము గలవారందు, చూడవచ్చును.

ఇట్లగుటచే మొదలు వేమన పచ్యముల సంఖ్యనిర్ణయించుట, వాని మూల పాఠమును గుర్తించుట, గ్రందకర్త యర్థము నెఱుఁగుట, యను మూఁడు. చిక్కులు, సామాన్యముగ తెగనివి, యున్నవి.

ఇప్పడు ప్రకటించిన పద్యములు నాలుగు వేలకు మించియున్నవంటిని. అవి బందరు ప్రతిలోనివి. దీనిలో లేనివి 125 పద్యములు "వేమనయోగి వేదాంత సిద్ధాంతము' అను ప్రతిలోఁగలవు. వావిళ్ళవారి ముద్రణమందును కొన్ని గలవు. కాని విమర్శించి చూచితిమేని కనీసము వేయి పద్యములైనను ఆచ్చుప్రతులనుండి మనము త్రోసి వేయవలసి యున్నది. వేమన పద్యములతో బోధించినవాఁడు. విషయ మొక్కటియైనప్పడు జ్ఞప్తి చక్కఁగా నుండెనా నిన్నటి పద్యమే వచ్చును; లేకున్న భావముననుసరించినఁ జాలునని యప్పటికిఁ దోఁచిన మార్పులతోఁ జెప్పి పోవు చుండెడివాఁడు. అట్లగుటచేత ఆ పద్యములలో ఆర్ధభేదమును రూపభేదమును లేక

  1. See Brown's Verses of Vemana, p. 109.
  2. † చూ, వం, సు, గారి వేమన, పే. 139