పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

వేమన

సారము"ను వ్రాసిన గణపతి దేవుఁడు మొదలగు వారు ఇదేమతమును పండితరంజ కముగా గ్రంథములం దుపపాదించినవారు. ఇట్లే భక్తి ప్రధాన మగు వైష్ణవమతమును సామాన్యజనులలో వ్యాప్తికిఁ దెచ్చిన రామదాసు, త్యాగరాజు, తాళ్ళపాకవారు మొదలగు కీర్తనకారులును, శృంగారము మూలమున విష్ణుభక్తిని వ్యాపింపఁజేయఁ బ్రయత్నించిన క్షేత్రయ మొదలగు అనేకపదకర్తలును ఇట్టి మతకర్తలు కాని మత ప్రచారకులే. కాని వీరిలో నెవరికిని వేమన్నకున్నంత వ్యాప్తి, చనవు రాలేదు.

కారణము స్పష్టమే. వీరిలో కొందఱనుభవము గలవారు. పలువురది లేని వట్టి నమ్మకము గలవారు. అనుభవించినవానిని గాని నమ్మినవానిని గాని ఇతరులకు నచ్చఁజెప్ప ధారాళమైన వాగ్దాటి గలవారరుదు; ఉన్నను ఇతరుల కుపదేశింపవలెసను నుద్రేకముగలవారరుదు. మతమనునది మొత్తము మీఁద తసకు సంబం ధించినది : అనఁగా, ఇందులోఁ జొరఁబడినవాఁడు ముఖ్యముగా తనగతిని తాను చూచుకొనును. అందును అద్వైతమతము. ఆ యుద్వైతానుభవానందమును వదలి, తెలియనివారికి, నమ్మిక లేనివారికి దానిని తెలిపి నమ్మించు నంతటి స్వార్ధ త్యాగులు అనేకులుండరు. ఉండినవానికి పాండిత్యమేమైనఁ గొంత యలపడెనా యిఁక పామర ప్రపంచమునకును ఆతనికిని సంబంధముండదు. చేసిన పనికి పండితతృప్తి వాని పరమార్థము. ఫలము శివయోగసారము' వంటి గ్రంథములు. సామాన్యజనులకు వీనివలన నేమియు లాభములేదు. త్యాగరాజవంటి వారి కీర్తనలలో భక్తియెంత యున్నను వారిగాన పాండిత్యము దానిని గప్పి పెట్టినది. పల్లవి చాటులను జూపద మనిపించునే కాని, వానిని పాడునపుడు ప్రాయికముగ భక్తిని ప్రకటింత మనిపింపదు. క్షేత్రయ వంటి వారి శృంగార పదములలో మూల భూతమైన భక్తి మునిఁగిపోయి, వినువారి కందలి పచ్చి పచ్చి మాటలు మాత్రము తటాలున తల కెక్కును. ఇక రామదాసు పాటలవంటి వానిలో రచన లేదు. గుంపులు గట్టి కోలాహలము చేయు రచ్చభజనలకు పనికివచ్చునే కాని, వినువారి హృదయమును బట్టి పిండునట్టి కావ్యశక్తి వానిలోలేదు. మఱియు నొక్కొక్క కీర్తనయును విశేష మేమియు లేక దిక్కులేనంత పొడుగుగా నీడ్వఁబడి యుండుటచే నందు భక్తియున్నను భావనంగ్రహములేదు, వేమన పద్యము లట్టివి కావు. అతనివి చిటుకలో ముగింపఁగల చిన్న పలుకులు ; అచ్చ తెనుఁగు పద్యపు నడక ; గుండుదెబ్బవలె గుఱి తప్పని చిక్కని చెక్కిన మాటలు. నోరుగల తెలుఁగు వారందఱును నేర్వవచ్చును. మఱియు "నేనొక గ్రంథము వ్రాసినాను. చదువుఁడు. మీకు తత్త్వము కరతలామలకమగును' అని చెప్పవలసిన పనిలేదు. పోయిన చోట్లనెల్ల పద్యములే. ప్రశ్నించిన వారికెల్ల పద్యములే. నిన్నచెప్పిన పద్యమే నేఁడు చెప్పటకు వెనుదీయలేదు. ప్రాఁతపద్యము కొంత మఱచి పోయిన క్రొత్తగా నప్పడే కూర్చి యతికించుటకును కొంకులేదు. విషయములను జెప్పనప్ప డొకరి లక్ష్యము లేదు. బిడియము, సంకోచము సున్న. తా నాడుమాటలలో తన కెప్పడును సందే హములేదు. కనుకనే సామాన్యప్రజల కితనియెడ నమ్మిక, భక్తి జనించినవి. పండితు లగువారికిఁ గూడ నితనిని పూర్తిగా తిరస్కరించుట సాధ్యము కాదు.

మతకర్తలు కాని మతప్రచారకులవలె కవులను పేరు రాక కవిత్వమును రచించినవారు మనలో ననేకులున్నారు. పైఁ బేర్కొనిస శతకములు, కీర్తనలు, పదములు వ్రాసిన యనంఖ్యాకులు ఈ తెగకుఁ జేరినవారు. లాక్షణిక దాసులగు ప్రాచీనులు వీరిని కవులలో లెక్కింపకపోవట యొక వింతగాదు. వీరేశలింగము