పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవల సంకులసమరము సమకూడినది. ఎవరిశక్తి కొలది వారు పోరాడిరిగదా. ఈవాగ్రణము భాషోపయోగమైన విషయముగాన మేమును మోమోటమిలేక వాగ్జన్యము గావించితిమి. అర్థరథు లతిరథులు మహారథులందఱు మాపక్ష మవలంబించిరి. కొన్నిప్రయోగము లుపసంహారములైనను మాకుజయమనుటకు సందియములేదు. పండితు లనేకులు మావాదమున కనుమోదకులగుటయే యిందుకు నిదర్శనము. అయిన నింతమాత్రమున మేము విఱ్ఱవీగువారముగాము. 'ప్రమాదోధీమతామపి' అని యున్నది గదా...... నిందింపం గడంగిరిగదా... ఇది యటుండనిండు. ఇప్పటికిని శ్రీ పంతులవారియందుం గడు గౌరవము మాకు గలిగియేయున్నది..."

ఇది యా వాదచరిత్రసంగ్రహము. దీనిని సమగ్రముగా నెఱుంగగోరువారు అముద్రితగ్రంథచింతామణినుండి గ్రహింపవలసినదేగాని ఈ లఘుగ్రంథమున హెచ్చుగావ్రాయ నవకాశములేదు.

ఇంతవరకును వేదము వేంకటరాయశాస్త్రులవారు విమర్శనలంగావించి ఎవరిహృదయములంగాని నొప్పించియుండలేదు. పైవాదముల సందర్భమున శ్రీ రామకృష్ణయ్యగారు పండితాభిప్రాయములను సేకరించువారై వేంకటరాయశాస్త్రులవారి యభిప్రాయముం గోరగా శాస్త్రులవారు కొన్నిజాబులు వ్రాసిరి. వానిని రామకృష్ణయ్యగారు తమ పత్రికయందు ప్రకటించిరి.