పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండిరి. ఇయ్యది చాలసంగ్రహముగా శాస్త్రులవారి సమకాలి కాంధ్రభాషాస్థితి.

వేంకటరాయశాస్త్రులవారు నాగానందమును ప్రకటించి ప్రతాపరుద్రీయమును ప్రకటించుటకు నడుమ జరిగిన భాషా వివాదములే శాస్త్రులవారి ప్రతాపరుద్రీయ నాటకరచనా దీక్షకు కారణమైనటుల తలంచవలసియున్నది. ప్రతాపము వారి హృదయమున చిరకాలమునకు పూర్వమే అంకురించినను పక్వమై వెలయుటకు ఇంతకాలము పట్టెను. ఈలోపల నాంధ్ర దేశమందు పండిత కవులు పరస్పర వైషమ్యములచే వ్రాసికొన్న వ్రాతలచే ఆంధ్రకవి పండితసంఘ మేర్పడి వేంకటరాయశాస్త్రుల వారిచే తుదముట్టెను. ఈవిషయములు శాస్త్రులవారి జీవితమున ప్రధానస్థానము నందుటచేతను, శాస్త్రులవారు వాఙ్మయ సమరమున పోరాడిన యోధుడగుటచేతను. ఈ చరిత్రనంతయు వదలుట భావ్యముగాదు.

ఈకాలమున నాంధ్ర దేశమున భాషావిమర్శకాదులకు పూనుకొని సూర్యాలోకము, ఆంధ్రభాషా సంజీవని, అముద్రిత గ్రంథచింతామణి, శశిలేఖ, వివేకవర్ధని, కలావతి మున్నగు పెక్కుపత్రికలు తీవ్రవిమర్శలు సలుపుచుండినవి. సూర్యాలోకమును, జి.సి.వి. శ్రీనివాసాచార్యులవారు మదరాసునుండి ప్రచురించుచుండిరి. ఇందు విద్యావిషయములేగాక లోక వృత్తాంతముకూడ ప్రకటింప బడుచుండెను. ఆంధ్రభాషాసంజీవని పత్రికను శ్రీ మహామహోపాథ్యాయులు కొక్కొండ