పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9-ప్రకరణము

సమకాలికపండితులు - నాటి పత్రికలు

ఆంధ్రవాఙ్మయము ఆంగ్ల విద్యాసంపర్కముచేత క్రొత్తపోకడల బోవుచుండిన యీకాలమున పలువురు పండితులును కవులును తమ నూతన రచనలచే నాంధ్రవాగ్దేవిని సేవించుచుండిరి. ఆంధ్రనగరమైన మదరాసునగరము ఆంధ్రభాషకు కేంద్రస్థానమైనది. నెల్లూరినుండి పుదూరుద్రావిడ బ్రాహ్మణులు మదరాసుప్రవేశించి అచ్చాపీసులను స్థాపించి సంస్కృతాంధ్ర గ్రంథములను ముద్రింప నారంభించిరి. శ్రీ చిన్నయ సూరిగారు 1862 సం. మున నిర్యాణము జెందగా వారి శిష్యులైన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు, తమ గురువుగారు ప్రారంభించిన గొప్పనిఘంటు నిర్మాణపద్ధతి అసాధ్యమని తలంచి ఒకపాటివిధమున శబ్దరత్నాకరమను నిఘంటువును 1885 లో ప్రకటించిరి. వావిలాల వాసుదేవశాస్త్రులు మున్నగువారు సంస్కృత నాటకములను తెనుగునకు అనువదింప మొదలిడిరి. శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారు, వీరేశలింగము పంతులవారు, ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు ఇంక ననేకులు వేంకటరాయశాస్త్రులవారికి సమకాలికులై ప్రబంధములను గద్యగ్రంథములను నాటకములను వ్రాయుచుండిరి. వీరేశలింగము పంతులవారును గురుజాడ శ్రీ రామమూర్తి పంతులవారును ఆంధ్రకవి జీవితములను వ్రాయు