పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకముగా రచించి ప్రకటించిరి. ఆంధ్రవాఙ్మయమునందలి మొదటి జాతీయనాటకము, స్వతంత్రరచన, ఇదియే. ఈ నాటకమందలి కథాసంవిథాన చమత్కారము, సన్నివేశ సౌభాగ్యము, సమన్వయసాలభ్యము, పాత్రనిర్మాణకౌశలము, రసపోషణము, కవనస్వారస్యము మొదలగువాని నిండు కలిమియటుండ, బహుపాత్ర నిర్మాణముంగావించి ఎనిమిది తొమ్మిదితెగల గ్రామ్యభేదములం బ్రయోగించి, తమ పాత్రోచితభాషాసిద్ధాంతమును స్థిరముగా నెలకొల్పుట మాత్రమేగాదు, శాశ్వతముగా రూపకవచనా విధానముం జూపినారు. 'ప్రౌడజనైకవేద్యరసం'బగు నీ నాటకము తమప్రాపక వరేణ్యులైన శ్రీ వేంకటగిరి మహారాజా వారికి తమ కృతజ్ఞతాసూచకముగా నంకితముం గావించినారు.

ఆ సంవత్సరమే మఱి రెండు స్వతంత్రనాటకములు వెలువడినవి. శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు తమ చిత్రనళీయమును, శ్రీ గురుజాడ అప్పారాయ కవిగారు+ తమ కన్యాశుల్క ప్రహసనమును ప్రకటించిరి.

_______________________________________________________

+ శ్రీ అప్పారావు పంతులవారు తమ నాటకముయొక్క పీఠికలో శ్రీ శాస్త్రులవారే పాత్రోచితభాషకు ప్రాపకులని తెల్లముగా వ్రాసియుండ ఇప్పుడిప్పుడే ప్రసిద్ధికి వచ్చుచుండు కొందఱు రచయితలు, శాస్త్రులవారి గ్రంథములం జదువకయు, ఆంధ్రవాఙ్మయమున వారు చూపినమార్గము లేవోతెలియకయు, వ్యాసములు వ్రాయగడంగి, వానిలో శ్రీ అప్పారావు పంతులవారు పాత్రోచితభాషను ప్రారంభించిరనియు, వేంకటరాయశాస్త్రులవారు ఆమతమును అనుకరించిరనియు వ్రాయుట పొరబాటు. ఇట్లే పెక్కుపొరబాట్లు అల్లుకొనిపోయి యున్నవి.