పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదస్మృతి యాకాలమున దొరకుట యఱుదు. మూడే తాళపత్రప్రతులు, నాగరిలిపిని, దేశమునకంతటికిని, మదరాసు, కలకత్తా, బొంబాయి హైకోర్టుపుస్తక భాండాగారములలో నుండినవి. మదరాసుప్రతిని జడ్జి శ్రీ సర్.టి.ముత్తుస్వామయ్యరుగారు శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారి కిచ్చి చదివి కొన్ని విషయముల కర్థము వ్రాసియిండని కోరియుండిరి. వారికి నాగరిలిపి తెలియనందున వారు దానిని చెదలువాడ సీతారామశాస్త్రిగారి చేతికిచ్చిరి. వారికిని ఆలిపి తెలియనందున ఆగ్రంథము వారిచేత కొంతకాలము వృథాగా పడియుండెను. ఒకదినము ఏలకో శాస్త్రులవారు వారియింట దానిని చూచి చదువబోగా వారి క్రొత్త శిష్యుడు 'మీకది తెలియదు' అని వారింపజూచెను. వేంకటరాయశాస్త్రులవారు మఱింతవడిగా దానిని పుచ్చుకొని చూడగా అది నారదస్మృతి. దానిని తమ కెరవిమ్మని తమ యుపాధ్యాయులవారిని కోరిరి.

సీతా:- 'అది నీకెందుకు, నీకేంతెలుస్తుంది'

వేంకట:- 'నాకు తెలియకపోతే మరెవడికి తెలుస్తుంది? నాకు పనికిరాకపోతే మరెవడికి పనికివస్తుంది? అని తీవ్రముగా బదులుచెప్పిరి.

సీతా:- 'అయితే నీకు నాగరిలిపి తెలుసునా ?

వేంకట:- 'అద్భుతంగా. రేపుతెల్లవారి మీకు మళ్లీతెచ్చి నప్పగిస్తాను లెండి.'