పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5-ప్రకరణము

వితంతువివాహ వాదములు

ఇంతవరకును శాస్త్రులవారికి వేంకటరమణశాస్త్రులవారి కొమారులని ప్రసిద్ధియేగాని వేఱువిధమున ప్రసిద్ధియేర్పడి యుండలేదు. 1880 సం. ప్రాంతమునుండియు శాస్త్రులవారికి ప్రసిద్ధి రాసాగినది. జీవితమున కొంత కుదురుపా టేర్పడసాగెను; పాండిత్యసంపాదనములకు అవకాశములు కలుగ నారంభించినవి; శాస్త్రులవారి జీవితచరిత్రములో నొక క్రొత్త ప్రకరణము ప్రారంభమైనది. ఆంధ్రదేశమందు వితంతూద్వాహప్రోత్సాహక వాదములు బయలుదేరినవి. ఈశ్వరచంద్రవిద్యాసాగరపండితుడు మున్నగువారు ఉత్తరహిందూస్థానమున చేయు ప్రచారమునకు అనుగుణముగ తెలుగుదేశమున శ్రీ వీరేశలింగము పంతులు మొదలైనవారు ఉపన్యాసము లిచ్చుచు విధవావివాహమునకు శాస్త్రనిషేధము లేదనియు, ఎల్లవారును చేయవచ్చునని చెప్పసాగిరి. సనాతన మతస్థులు కొందఱు శాస్త్రులవారిని గ్రంథములు పరిశోధించి ఉపన్యాసము లిండని కోరిరి. ఆకాలమున మదరాసులో హిందూసభ యొకటియుండెను. దానిప్రాపున శాస్త్రులవారు ఉపన్యాసము లిచ్చుచు ఇతరులవాదములను ఖండించి విధవావివాహమును శాస్త్రముమాత్ర మొప్పదని చెప్ప మొదలిడిరి. నిరంతరము ఈవిషయమై గ్రంథములను శోధించుచుండిరి.