పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాసములు వ్రాయుచునేయుండిరి. వీనిలో మామిత్రులు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి 'సుమనస్మృతి' ప్రశంసనీయకావ్యము. నేనును కోరినవారికెల్ల విషయసహాయము చేయుచునే యుంటిని. భారతిలో 1936 సం., శ్రీతాతగారిచరిత్రను తొలిమారు సమగ్ర వ్యాసముగారచించి ప్రకటించితిని. కొంచె మించు మించుగా నాకాలముననే శ్రీధరణికోట వేంకటసుబ్బయ్యగారు, మేము ప్రకటించిన సాహిత్యదర్పణమున కుపోద్ఘాతముగా, నొకటి రచించిరి. ఆవెనుక శ్రీగుఱ్ఱము సుబ్బరామయ్యగారు 'శాస్త్రి సంస్మృతి'ని ప్రకటించిరి. ఇటీవలనే శ్రీ వంగోలు వేంకట రంగయ్యపంతులుగారు త్రిలిఙ్గపత్రికలో కొన్ని వ్యాసములు వ్రాసి వానినెల్ల నొక్కటిగా సంపుటీకరించినారు. నేను, గురుపాదథ్యానముగాను, సామాన్యవిద్యార్థులకు పఠనపాఠన యోగ్యముగానుండునట్లును, సమకాలికాంధ్రభాషాస్థితిని వర్ణించుచు సంగ్రహముగా నొకచరిత్రను వ్రాయసంకల్పించి, అనవసరములని నామదికిం దోచినవానిని వదలి ఈచిన్నిగ్రంథమును వెలువరించు చున్నాడను. మేమెల్ల నొకవిషయమునుగుఱించియే ఇట్లు వ్రాయుట గురుభక్తి పారవశ్యముచేతను, ఈవిధముగానే పలువురు వ్రాయవలయు ననుతలంపుచేతను. యుద్ధమువలని బాధలెల్ల నీగి, మనకు జయకాలము వచ్చి, ముద్రణ పరికరములెల్ల వెలలు తగ్గి అనుకూలించి, సమగ్రమైనచరిత్రను ప్రకటించు నవకాశము త్వరలో కలుగునుగాక.