పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము


"ఇది వేదము వేంకటరాయశాస్త్రులవారి యోగ్యతను తెలియజేయు పత్రిక ....... వీరు కొన్ని యేండ్లకుముందు రమారమి ఒకటియునర సంవత్సరము నార్మలు స్కూలులో నాయొద్ద తెనుగు చదువుచుండిరి. అది మొదలు నేను వీరిని బాగుగ గుర్తెఱుంగుదును. చదువునప్పుడు వీరుచేయు విద్యావిషయకమైన ప్రశ్నలకు సదుత్తరములుచెప్పి వీరిని సమాథాన పఱచి నాపాండిత్యగౌరవమును మాటిమాటికిని నిలువ బెట్టుకొనవలసి వచ్చుచుండెను............................1882.

1875 సం. శాస్త్రులవారు రాజమండ్రిలో ఎఫ్.ఏ. పరీక్ష నిచ్చిరి. వారి ప్రిన్సిపాలు, దొర యొకడు, ఎందుచేతనో వారిపై ఆదినుండియు గంటువహించి యుండెను. పరీక్ష హాలులో శాస్త్రులవారు తెలుగు పేపరుకు జవాబువ్రాయుచుండిరి. మూడు గంటలకాలము. మొదటి రెండుగంటలు పరీక్షప్రశ్నలను అపార్థముచేసికొని జవాబులను తప్పుగా వ్రాసినారు. రెండు గంటలై పోయినవి. వెనుక మేలుకొని మొదట వ్రాసినదంతయు కొట్టివేసి అదంతయు మరల వ్రాయనారంభించి చాలవడిగా వ్రాసినారు. కాని ఆటవెలది తేటగీతి లక్షణములు వ్రాయవలసి యుండెను. 'ఇనగణత్రయంబు నింద్ర ద్వయంబును' అనివ్రాసినారు. గంటవినబడినది. 'హంసపంచకంబు నాటవెలది' అనివ్రాసినారు. దొరచూచి పేనా లాగుకొని పోయినాడు. అంతట చిటెకెనవ్రేలు సిరాలోముంచి "సూర్యుడొక్కరుండు సుర రాజు లిద్దరు"