పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ముత్త్యాలపేటలో తొలుత సంస్కృతాంధ్రద్రవిడ పాఠశాల యుండెను. దానికి మా నాయనగారు వేదము వేంకటరమణశాస్త్రులవారు ప్రథానపండితులుగా నుండిరి. సీతారామచార్యులవారు ఆంధ్రపండితులు, తోటపల్లి సీతారామయ్యగారు ద్వితీయాంధ్రపండితులు. అరవమునకు జ్ఞానసుందర పండా రాదులుండిరి. మానాయనగారు శాస్త్రోక్తాచారనిష్ఠులు, అసత్య దూరులు, అప్రతిగ్రాహకులు, వ్యాకరణమున అపరపతంజలి యని పేరొందినవారు, సీతారామచార్యులను ఆంధ్రవిద్యకు మెచ్చియు, ...లంపటుడని విగర్హించుచుండిరి. అందువలన సీతారామాచార్యులవారు తమ శనివారపు సంగీతగోష్థులకు నన్ను పిలుచుట లేదు. అట్టివానికి నేను పోవుటయులేదు."

శాస్త్రులవారు ఆపాఠశాలలో చేరిన మొదటిదినములలో ఆచార్యులవారి పాండిత్యాతిశయములను చక్కగ ఎఱుంగ నందున వారిని మాటిమాటికి ప్రశ్నలువేసి వేధించుచుండువారు. అటుపిమ్మట తండ్రిగారి కడకు పోయినప్పుడు ఈసంగతి చెప్పగా వారు నవ్వి "నీవు పొరపడితివి, వారు ఆంధ్రములో మహాపండితులు." అని వచించిరట. శాస్త్రులవారు ఆచార్యుల వారిని మరల దర్శించినపుడు తమ యవినయమునకు క్షమాపణ కోరగా వారు "నీవు గడుసువాడవు" అని అభినందించిరట. శాస్త్రులవారు ఆ పాఠశాలను వదలిన చాలకాలమునకు మరల గువర్యులను దర్శించి తమకు యోగ్యతాపత్రము నొకదానిని దయచేయు డని కోరినప్పుడు వారు ఈవిధముగ వ్రాసియిచ్చిరి.