పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"దూరమునుండిచూచువారికి భయంకరుడు. సన్నిధిసేసినవారికభయంకరుడు. ఈయన స్వవిరచితగ్రంథములునట్లే. పైపైజూచువారికి పాషాణ కఠినములు నీరసములు. చొరబడి చదివినవాడు ద్రాక్షాదికదళీపాకములు రుచిగొనగలడు. కవిత్వమునందలి బింకము, శబ్దప్రయోజనము, సందర్భౌచితి అచ్చునబోసినట్లుండును. ఇంతేల రసదృష్ట, శబ్దస్రష్ట.

"ఇక ధార్మికవిషయము లెఱిగినవాడు. పూర్వాచారముల యెడవిశ్వాసములేదు. నవీనాచారములయెడ వ్యామోహములేదు. సమయానుకూలముగ సంచరించునేర్పరి. విస్పృహతతో లాంపట్యము కలదు, కోపము క్షణికము. పంతమధికము. తుష్టి లేనితృష్ణ. కలిమిలేములీయనకు గావడికుండలు. దరిద్ర దేవతతో బోరాడని గడియయుండదు."

తుదకు జీవితము తిన్నగానడువలేదు. తలంచినపనులు సరిగారాలేదు. కుమారుడు లేతవయసులో చనిపోయెను. అచ్చాపీసు విక్రయింప వలసివచ్చెను. ఆంధ్రభాషాభిమాని సమాజము అంతరించెను. శరీరమందనారోగ్యము అధికమాయెను. కుటుంబ భారము ఎక్కువయైనది. చదువుకొనవలసిన వారము మేము నలువురము (మువ్వురము మనుమలమును ఒక్కమనుమరాలును) ఏర్పడితిమి. తలవని తలంపుగానొక ఋణమేర్పడినది. ఆర్జన బొత్తిగాలేక పోయినది. ఈవిధముగా తుదిదినములలో తాతగారు తమవశము కాకపోయిరి. కాని శ్రీ యేనాదిరెడ్డి గారియు వారి రెడ్డిసంఘము వారియొక్కయు సాయముచే ఋణ నివర్తియైన సంతసమునుమాత్ర మనుభవించిరి. ఇక నిన్ని గ్రంథములనురచించి తమరెడ్డిమిత్రు లనామాంకితము గావింపవలయుననెడు ఆసయుండినదిగాని అయ్యది నెఱవేర్చుకొనలేకయే కాలగతింజెందిరి.