పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదంతయు తాతగారు చనిపోవుటకు కొన్నినెలలు ముందు జరిగినది. అప్పటికి వారితల్లిగారు ఇంకను జీవించియుండిరి. లక్ష్మమ్మగారు ఉడాలి యశ్వత్థసూర్యనారాయణ సోమయాజులవారి ప్రథమపుత్రిక నూటరెండేండ్లు జీవించియుండిరి. కడపటివరకు దంతపటుత్వ లోపముగాని దృష్టిలోపముగాని లేదు. తుదిదినములలో కొంత అస్తవ్యస్తముగా నుండిరి. తాతగారికి తల్లిగారియందు చాలభక్త్యనురాగము లుండెడివి. నెల్లూరిలో ఏసన్మానము జరిగినను, సన్మానము జరిగినవెంటనేవచ్చి తల్లిగారిని దర్శించి పూలమాలలతో తల్లిగారిపాదములలోవ్రాలి ఆవెనుక అలంకరణములను తీయువారు. తాతగారు చనిపోవుటకు దాదాపు ఆఱునెలలు ముందు వీరుగతించిరి. వార్ధక్యమున, లేవలేనిస్థితిలో తల్లిగారికి క్రతువులు చేయవలసివచ్చినది. సోదరులు చేయుచుండగా తాతగారు చెంతకూర్చుండియుండు వారేగాని అంతకన్న నేమియు చేయలేక యుండిరి. డెబ్బదియైదవయేట తాతగారు తల్లినికోల్పోయిరి.

1928 సంవత్సరము డిసెంబరునెల ఆఖరులో గావలయు శ్రీ ఏనాదిరెడ్డి గారు తాతగారిని దర్శించి 'తమఋణమును తీర్చి వేసితిమి' అని చెప్పినప్పుడు ఆయిరువుర సంతోషమునకు మేరలేదు. నెల్లూరిశిష్యులచే తమకేర్పడిన ఋణము తమ చిరకాలమిత్రుల సాయముచే తీరెనుగదాయని తాతగారు పరమానందముంజెందిరి. సంతోషముచే కొన్ని నిమిషములు ఏడ్చుచుండిరి.