పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందర్శించి కొన్ని చందాలువేయించితిని. మిగత చందాలు వేయించుటకును చందాధనము వసూలుంజేసి మానలువురము నిర్ణయంచుకొనిన కోశాధ్యక్షునివద్దనుంచి శాస్త్రువారి ఋణముందీర్చి మిగతధనమును శాస్త్రులవారి కుటుంబమునకు వినియోగించవలసినబాధ్యత నాయందేయుంచిరి. ఈరామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, పట్టాభిరామరెడ్డి, వీరారెడ్డిగార్లు ఆజన్మము ఇచ్చుట యెఱిగినవారేగాని అడుగుట లెఱుగని వారలయ్యును శాస్త్రులవారి యందలి ఆదర ప్రపత్తులచే గొప్ప మొత్తములను విరాళముల నిచ్చియు నన్ను వెంటనిడికొని అనేకస్థలములకు తిరిగి గొప్పసాహాయ్యమొనర్చిరి. ఈసత్పురుషులకు నలువురకు నేనాజన్మము కృతజ్ఞుడను. మేము వసూలుచేసిన మొత్తమును తనవద్ద భద్రపఱచి శాస్త్రులవారి ఖర్చులకు నేను తెలియజేసిన అనుక్షణముననే వారికింబంపుచు నాకుందోడ్పడుటయే గాక అపుడపుడు తనవద్ద నిలువయున్న మొత్తములకు వడ్డి సయితమొసంగిన కోశాధ్యక్షులును శాస్త్రులవారియందలి మిక్కిలిభక్తి ప్రపత్తులుకలవారునగు శ్రీయుతులు దొడ్ల రామారెడ్డి గారికెంతయు కృతజ్ఞుడను. అంతట దాదాపు పదునొకండు వేల పరిమితము చందాలు వేయించి వసూలుప్రారంభించి చెన్నపురికిబోయి ఆడుమానదస్తవైజు లెక్కచూడగా అసలుఫాయిదాలు రు 7500 అయినందుకు శ్రీమాన్ శఠగోపరామానుజాచార్యులవారు (మొదట అప్పిచ్చినవారు) ఏడువేలు మాత్రము పుచ్చుకొని మిగత సంతోషముగ త్రోచివైచిరి."