పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నామని వ్రాసిరి. జైలునుండి విడుదలయై వచ్చినదినము సమాజమువారుపోయి వారిని ఊరేగింపుగా ఊరిలోనికి కొనివచ్చిరి. మాయింటివాకిట నిలిచి దొరసామయ్యంగారు లోనికివచ్చి తాతగారికి సాష్టాంగముగా నమస్కరించి 'శ్రీదయితుండు దానవులజెండి' అనుపద్యము, ప్రతాపరుద్రుడు విడుదలయైన వెంటనే యుగంధరుని పాదములవ్రాలి చెప్పునట్లు చెప్పి కన్నీరు కడవలునేడ్చిరి. తాతగారును ఏడ్చిరి. అప్పటికే దుర్బలులుగా నుండిన వారగుట దొరసామయ్యంగారిని చెంతనున్నవారు పట్టుకొని లేపవలసి వచ్చినది. తాతగారు ఆశీర్వదించి వీడ్కొనిరి. ఆతర్వాత చాలకాలము తాము బ్రదుకజాలమని దొరసామయ్యంగారికి తోచినది. ఒకమారు మరల దుష్యంత ప్రతాపరుద్రపాత్రల నభినయించి ఆవెనుక చనిపోవలయునని తమ యాశయమని తాతగారికి తెలుపగా వేంటనే తాతగారు వారిని మరల సమాజములో చేర్చుకొనిరి. ఆవెనుక కొన్నినాటకములు నెల్లూరిలో ప్రదర్శింపబడినవి. 1925 సం వచ్చుసరికి దొరస్వామయ్యంగారు, బంగారయ్యగారు, యరగుడిపాటి సోదరులు ఇంకను పలువురు గతించిరి. సమాజమునుండి కొందఱు లేచిపోయి ఆంధ్రసభలో చేరిరి. అంతట ఎక్కువకాలము సమాజము జరుగదని తలంచి తాతగారు రత్నావళీ నాటికను ప్రదర్శింపించి, సమాజమునకు 25 సంవత్సరములు నిండుటచే రజత మహోత్సవమును జరిపిరి. ఆవెనుక సమాజము అంతరించినది.


__________