పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీనియందంతయు ప్రతిబింబించునది శాస్త్రులవారి మూర్తి. అక్షరమక్షరమును వారిశిక్షయే. నటునిచూడగానే ఫలానిపాత్ర కీతడుతగునని వారికి తోచును. వా రేపాత్రయొసంగిన ఆపాత్రనే నటులు ధరింపవలయునుగాని అన్యథా వర్తించుటకు అవకాశముండెడిది కాదు. పైగా వారిచ్చినపాత్రను ధరించిన వారికి ఆపాత్రయందు కీర్తివచ్చెడిది. మఱియొకపాత్రను ధరించిన చెడిపోవు చుండెడిది. ఇదియే డైరెక్టరుల కుండవలసిన లక్షణము. తాతగారిని ఒకరు ఈవిధముగా ప్రశ్నించిరట 'శాస్త్రులవారూ, తాము నటులనుచూచి వారికి తగిననాటకములను వ్రాసితిరా? లేక నాటకములకు తగిననటులు, అదృష్టవశమున, మంచివారు, దొరకినారా? లేకున్న అంతచక్కగా ఆపాత్రలకు ఈ నటులు కుదిరిపోయినారేమండీ!' అని, పాత్రకు సరియైన నటుని గ్రహించినవారు శాస్త్రులవారు. భారతాభారతారూపక మర్యాదలను వ్యాసములో నిట్లువ్రాసియున్నారు.-

"నటులంగూర్చియు ఒకమాట చెప్పవలయును. నటునికి వాగ్మిత, దిట్టతనము, అనుకరణనైపుణి, సమగ్రనిజపాఠ్యపరిజ్ఞానమే కాక సమగ్రనాటక పరిజ్ఞానమును, ప్రజ్ఞయు వలయును.

"నటులను అర్హతంబట్టి పాత్రములకు నియమించినచో ఒజ్జలకు ప్రయాసముండదు. ప్రయోగము శోభిల్లును.

"పాఠ్యములో నటునికి ఒజ్జ ప్రతిశబ్దమును (ప్రతియక్షరమనియుం జెప్పనొప్పును) నేర్పవలయును. ఒద్దికలో నటులు