పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాగ్దాతలకును మిత్రులకును శిష్యులకును శాస్త్రులవారు జాబులు వ్రాయసాగిరి ప్రత్యుత్తరములు వ్రాసినవారు కొందఱును వ్రాయనివారు కొందఱునుగ పరిణమించెను. స్వస్థలమున నివాస మేర్పఱచుకొంటిమని సంతసించుటకు బదులు శాస్త్రులవారికి ఋణశల్యమేర్పడెను."

తాతగారి తుదిదినములు ఈవిధముగా పరిణమించినవి. ఏదైనను ద్రవ్యము వచ్చిన వెంటనే దానికి రెండింతలు ఖర్చు కాచుకొనియే యుండెడిది. ఎన్నడును జీవితమున సత్కారములకై నానారాజ సందర్శనములకేగు నలవాటు బొత్తిగా లేని వారైనను శ్రీగద్వాల సంస్థానప్రభువులు శ్రీ సీతారామ భూపాలరావు బహద్దరు వారిని దర్శించుటకై 1924 సం. గద్వాలకుపోయిరి. అచ్చట మంచి సత్కారమే జరిగినది. ఆస్థానపండితులు ఎక్కువగా నభినందించిరి. ఆపండితులు వీరవైష్ణవులు. విద్యావిషయములలో శాస్త్రులవారితో ప్రసంగించుచు దినదినమునకు శాస్త్రులవారిమీది భక్తి అధికమగుచుండగా నొకదినము వారుచెప్పిన విషయములకు ఆశ్చర్యపడి "మేము ఎన్నడును స్మార్తులకు నమస్కరించినది లేదు; ఇదుగో సరస్వత్యంశ సంభూతులకు తమకు నమస్కరించుచున్నాము" అని పాదానతులైరి.

శ్రీ పుల్లగుమ్మి వేంకటాచార్యులవారు శాస్త్రులవారివంటి పండితుని కనివిని యెఱుగమని యిట్లు శ్లోకమును వ్రాసిరి-