పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21-ప్రకరణము

జ్యోతిష్మతీవిక్రయము

సూర్యరాయనిఘంటువును వదలినవెనుక రెండుమూడు సంవత్సరములు తాతగారికి గ్రంథరచన కవకాశము దొరకలేదు. బొబ్బిలియుద్ధ నాటకమును 1916 సం. మున ప్రకటించిరి. దానిని శ్రీ మహారాజావారికి పంపుకొనుభాగ్యము వారికి లభింపలేదు. ఆ వెనువెంటనే 1918 సం. పిబ్రవరిలో నిఘంటువుతో సంబంధము వదలిపోయినది. అప్పులవారు చుట్టవేసికొనిరి. శ్రీ మహారాజావారికడ నప్పుగాతీసికొనిన ద్రవ్య మింకను చెల్లింపలేదు. ఈరెండేండ్లును గుమాస్తాలు చేసిన ద్రోహమునకు మితములేదు. దాదాపు ఐదాఱువేల రూప్యముల ఋణ మేర్పడియుండెను. రెండేండ్లు ఎట్లో అచ్చాపీసును నిలుపుకొన వలయునని తాతగారు ప్రయత్నించిరిగాని సాధ్యము కాలేదు. తుదకు జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను విక్రయించివైచి, ఆ ఋణములనెల్ల నిశ్శేషముగా తీర్చివైచిరి. వారికి మదరాసులోని యిల్లును తామదివరకు ముద్రించియుండిన పుస్తకముల కట్టలును మిగిలినవి. పుస్తకవిక్రయముచే నేర్పడిన ద్రవ్యముచే కుటుంబమును నిర్వహించుకొనుచు, కొంత మనశ్శాంతినంది, 1919 సం మునుండి మరల గ్రంథరచనకు ప్రారంభించిరి.