పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయుద్యోగమున్నంత కాలము నాయచ్చుకూటంపు బనులం జూచు చుండినవారు వంచకులై నష్టములు కల్పించి ఈరెండేండ్లు మదీయ సంపాదక వేతనమును ఇంకనధికమును హరించిరి. అందువలన నాకు సంభవించిన యొడుదొడుకులను దిద్దుకొనుటకై అచ్చకూటంపు సామానులను నిశ్శేషముగా విక్రయించి ఆవ్యాపారమును త్యజించి తాను మిగిలియున్నాడను.

లోకక్షేమదీక్షీతులైన మీహృదయమందలి పరమాత్మ ఈవృత్తమును అవధరించును గాక.

ఇట్లు విన్నవించుకొనువాడు
దేశక్షేమపరాయణుల విధేయుడు
వేదము వేంకటరాయశాస్త్రి.

నిఘంటుసంపాదకత్వ మీవిధముగా తేలిపోయినది. శృంగారనైషధ ముద్రణానంతరము శాస్త్రులవారికి చిక్కులువచ్చినవి. మదరాసునుండి నెల్లూరికి అచ్చాపీసునుమార్చినది పొరబాటైనది. వ్యాపారముచెడినది. ఇంతలో ఆశ్రిత కల్పవృక్షము శ్రీ మహారాజావారు సాయపడిరి. కాని ఆసహాయముయొక్క ఫల మనుభవించులోపల నిఘంటూపద్రవమువచ్చినది. ఇంతలో ఆప్రభువు నిష్క్రమించెను. నైషధవ్యాఖ్యానకృతిపతి శ్రీ లక్ష్మీనరసారెడ్డి గారును గతించిరి. శ్రీనాథుని చరమదశవలె నేర్పడినది. నిఘంటువైనను తమపేరిట వెలయునుగదాయని మనశ్శాంతి చేసికొనుటకులేక ఆసంపాదకత్వమును చాలించు కొనవలసి వచ్చినది. శాస్త్రులవారికి మరల నచ్చాపీసే గతియైనది. నిఘంటువు శాస్త్రులవారి చేతినుండి తప్పిపోయినదిగదా యనుచింత శాస్త్రులవారి స్నేహితులకేగాక ప్రతివాదులకును ఏర్పడినది.

___________