పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి పరామరిక్రింద జరుపుకొనవచ్చుననియు, మదీయ సంపాదకత్వము 4-11-17 తేదినుండి మూడునెలలకు మదరాసులోనే నివర్తిల్లుననియును ఆసభలో నిర్ణయములు చేయబడినవి. పరిషత్తువారి పరామరికంగూర్చి నాతోగూడ శ్రీయుతులు వేమవరపు రామదాసుపంతులు బి.ఏ., బి.ఎల్., గారును, నాగపూడి కుప్పుస్వామయ్య బి.ఏ., గారును "ఈనిఘంటుకార్యము మనచేతినుండి తొలగి దూరదేశమునకు పోయినపిమ్మట దీనిపై మన పరామరిక యేల." అని యాక్షేపించిరి. ఆయాక్షేపము రామయ్యగారికి అసమ్మతుముగా నుండినది, సభలో అది నెఱవేఱలేదు.

నిఘంటు సభాసమ్మేళకులయిన శ్రీయుత గుమ్ముడూరి వేంకటరంగరావు ఎం.ఏ., గారు, 1914 సం. లో మదరాసులోను, 1915 సం. లో నెల్లూరిలోను, నాతో "మీరు ఏతన్నిఘంటుసంపాదనాధికారమును వహింపవలయునని పరిషత్తువారి యభిమతము; దానిని మీరు నెఱవేర్చిన ఆంధ్రలోకమునకు ఉపకారమును మీకు కీర్తియును గలుగును; కావున మీరీయధికారము నంగీకరింపదగును." అని బోధించిరి. వెంటనే నెల్లూరిలో మదరాసులోని యొకానొక పరిషత్సభ్యుని బంధుమిత్రుల వలననుండి పారంపరీణముగా "ఈ యధికారమున ఈయనను రెండుసంవత్సరములే యుంతురు, అప్పటికి ఫలాని వారలు రాజకీయోద్యోగ విరతులై స్వయముగానే దీనిం బూనుదురు." అని యొక కింవదంతి కలిగినది. అనంతరము నేను మదరాసులో వేంకటరంగారావు గారిని దర్శించి ఆకింవదంతిని నివేదించి "ఏమట్లు జరుగునా? అట్లేజరుగునేని, ఈయుద్యోగంపు జీతముపాటి యాయతిని నాకొసంగందగిన ముద్రాశాలా వ్యాపారమును దీనికై మానుకొని ఇదివిరమించినంతట నిరాధారుడనగుదునే!" అని యడుగగా, వారు "నేను సమ్మేళకుడనుగా నుండగా అట్లు జరుగనేరదు." అని వాక్రుచ్చిరి. ఆమాటపై ఈపనిని 5 ఏండ్లనియోజనమును, 2 ఏండ్ల కనంతరము ఇరుపక్షములను 3 నెలల హెచ్చరికచే విరామనియమనమునను, గైకొంటిని. ఆరెండేండ్లునయినవి, కింవదంతియు నొకవిధముగా నెఱవేఱినది.