పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఛాన్సెలర్ మహాశయా,

ఉభయభాషాపారీణులైన శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారికి 'కళాప్రపూర్ణ^' అను గౌరవబిరుదమును ఆంధ్ర విశ్వకళాపరిషత్‌పక్షమున తాము సమర్పింపవలయు నని నావిన్నపము.

శ్రీ శాస్త్రులవారు చెన్నపురి క్రైస్తవకళాశాలలో జిరకాలము ప్రథానసంస్కృతపండితులుగనుండి పెక్కండ్రు విద్యార్థులకు జ్ఞానబోధచేసి కృతకృత్యులైన మహానుభావులు; మఱియు బహుగ్రంథముల రచించి భాషాభివృద్ధికి మిక్కిలి తోడ్పడినవారు. వీరు రచించిన ప్రతాపరుద్రీయాది స్వతంత్రగ్రంథములు వీరికవితాపరిపాటికిని, విమర్శనగ్రంథములు వీరి సునిశిత మతవిశేషమునకును, శృంగార నైషథాది వ్యాఖ్యానములును, కథాసరిత్సాగరాది భాషాంతరీ కరణములును వీరి రసజ్ఞతకును, సర్వంకషమైన పాండిత్యమునకును, తార్కాణములు. వార్ధకదశయందును మన:క్లేశ దేహక్లేశములకు వెనుదీయక, ఆముక్తమాల్యదకు సమగ్రమగు మహావ్యాఖ్యానమును వీరు మొన్ననే రచించి ప్రచురించుట తలపోయగా, భాషాకృషి వీరికి గర్తవ్యముగానేగాక స్వభావముగ గూడ బరిణమించినట్లు స్పష్టమగుచున్నది.