పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రసాహిత్యపరిషత్తుయొక్క మంత్రిసభవారు ప్రధానసంపాదకునకు తదీయనియోజనమును తెలిపిన పత్త్రములో ఇరువురను సహాయసంపాదకులను నూఱేసిరూపాయల మాసవేతనములపై నియోగించెదమని వ్రాయించినారు. కాని, అట్టి సహాయసంపాదకులను నియమింపలేదు. ఆదిలో ఆయనకు ఇరువురు లేఖకులు ఉండిరి. ప్రధానసంపాదకుడు అతివేగముగా నిఘంటు ప్రకారనివేదన గ్రంథకమును రచించునప్పుడు ఆయిరువురును తదర్థమై కొన్ని పుస్తకములనుండి కొన్నివిషయములను వెదకుటయందు సాయపడిరి. అనంతరము త్వరలోనే ఆయన వారితోడ్పాటును కోలుపోయెను. నాటినుండి ప్రధాన సంపాదకుడు ఎవరిసాయమును లేకయే విషయ సంకలనార్థమై ఆలోక నీయములైన పుస్తకములను ఎత్తియిచ్చు పరిచరుడైనను లేక ఏకకుడుగానే పాటుపడ వలసియుండెను.

కార్యస్థానము పుదుపేటలో నున్నంతకాలము, దానికి దాపున ప్రాగ్దక్షిణదిశలయందు మునిసిపాలిటీ వారి నగరజన పురీష నిర్హరణ శకటవ్రాతముల నిలువరపుఠావులగుటంబట్టి, ప్రధాన సంపాదకుడును ఆ లేఖకులును మఱియొక లేఖకుడును మఱుగుబెరటిలో కట్టివైపంబడిన జనులయొక్క దుర్దశను అనుభవించు చుండిరి. మఱియు కార్యస్థానమైన గృహమందు మఱుగు బెరడు లేనందున ప్రధానసంపాదకుడు బహిశ్శంకకు పోవలసివచ్చిన సమయములయందు మునిసిపాలిటివారి సార్వజనిక పురీషాలయములకు పోవుటయు, అందు వర్ణనకు మనస్సొప్పని దు:ఖకర ఘోరానుభవములకు పాలగుటయు, సంభవించు చుండెను. కార్యస్థానమున వాయుమార్గములను మూసినచో ఊపిరిసలుపదు. తెఱచినచో పుర్వోక్తములైన మునిసిపాలిటీబండ్ల దుర్గంధము అలుగులుతెంచుకొని వెల్లువపాఱి ప్రధానసంపాదకుని ప్రాణవాయువును ముంచి కొట్టుకొనిపోవును. ఇప్పుడుసయితము చింతాద్రి పేటలోని కార్యస్థానాలయమునందు అన్నిగదులలోను మేలయిన ప్రధానసంపాదకుని గదియు ఇంచుక తక్కువగా ఉక్తదుర్గంధదశకే లోనయియున్నది.