పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గత్యలంకారములకు దృష్టాంతములైన మాటలతో, సభోపసంహారముం గావించితిని.

ఆంధ్రభాషకు నూతనజీవనమును, నవీనకళను, నవ్యమును దినదినప్రవర్ధమానమును నయిన పరిణామమును ప్రసాదించిన పండితులును కవులును నాటకకర్తలును వచనరచనాధు రీణులును వ్యాఖ్యాతలును అయినవారిలో శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు ప్రథములు - అద్వితీయులు. వీరిపేరుచెప్పి, ఇంకెవరిపేరు చెప్పనగును?

కావుననే వీరికి 'కళాప్రపూర్ణ' బిరుదమును ఆంధ్ర విశ్వవిద్యాలయముచే 1927 వ, సంవత్సరమున నిప్పించి ధన్యుడనైతిని. "నన్ను బి.ఏ. చేయవా?" అని నేను వైస్‌ఛాన్సలర్ అయినప్పుడు హేళనముగ నన్నడిగిరి. "అయ్యా, బి.ఏ., లను పుంఖానుపుంఖములుగ మీరలు చేసినారు గదా. ఈపిచ్చి మీకెందునకు?" అని నేను ప్రతిహేళనమొనర్చితిని. మనసులో మొదటినుండియు ఒక్కతలంపు నాకుండెడిది. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు స్థాపనకువచ్చిన పిమ్మట జరుగు మొదటి బిరుదప్రదాన మహోత్సవములో శ్రీశాస్త్రులవారికి 'కళాప్రపూర్ణ' నామకమైన డాక్టొరేటు బిరుదమును కానుకగా సమర్పింపవలెనని. భగవంతుని కృపచే ఆయభిలాష నెఱవేఱెను. ఈక్రింది ప్రశంసావాక్యములతో ఆ యుత్తమగౌరవ - బిరుదమును 1927 సం. డిసంబరు 5 తేదిలో నడచిన కాన్వొకేషనులో సమర్పించి మన యూనివర్సిటీ కృతకృత్యతా మహిమ వహించెను.