పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టిసమయమున శాస్త్రులవారికి, వారిపోషకులును బహుకాల మిత్త్రులునునైన, శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరువారు సాయపడిరి.

కథాసరిత్సాగరమును తొలుత ముద్రించినకాలముననే (1891 సం.) శాస్త్రులవారికి శ్రీ మహారాజావారి యాదరము లభించినది. అదిమొదలు ఒక్కొకగ్రంథము ముద్రితమైన వెంటనే శాస్త్రులవారొకప్రతి శ్రీ మహారాజావారికి పంపుటయు శ్రీ వారు వానింబఠించి విమర్శ పూర్వకాభిప్రాయములను తెలుపుటయేగాక పారితోషికములంగూడ పంపుచుండిరి.

శ్రీ శాస్త్రులవారి శాకుంతలముంగాంచి శ్రీ రాజాగారు వీరిని సన్మానించిన విధము శాస్త్రులవారి వాక్యములలోనే ముద్రించుట మనోహరము. "నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని. అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు మౌంటురోడ్డు మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.