పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముద్రించినారు ఆపైనెలలోనే "అద్దములోని లిబ్బివలె రసికులకు నబ్బియు నబ్బని యర్థములచే నబ్బురమెసంగుచు, కాకలీగీతముంబోలె మదురంబయ్యు నస్ఫుటంబై, రసికగోష్ఠులయందు సందేహాంతచర్యలకుంగారణంబైన కాకిమొలకువలతోనిండి సంపూర్ణానుభవమునకు రాకయున్నట్టి రసోత్తరప్రబంధమును" విజయ విలాసమును, ఎల్లవారికిని సుబోధంబుగా నటీకముగా ప్రకటించినారు. ఈగ్రంథములను శాస్త్రులవారు ప్రకటించి నేటికి ముప్పది రెండు సంవత్సరములైనవి. ఈలోపల పెక్కుతాళపత్రములును దొరకినవి. చారిత్రపరిశోధనయు జరిగినది.

ఈజ్యోతిష్మతీముద్రాక్షరశాలలో శాస్త్రులవారి గ్రంథములేగాక ఇతరులగ్రంథములును అచ్చగుచుండినవి. ఆంధ్ర విజ్ఞాన చంద్రికామండలివారి గ్రంథములును, చల్లావారి వైదిక గ్రంథములును, రామా అండ్ కంపెనీవారి ప్రచురములును, ఇంకను అనేకులగ్రంథములు అచ్చగుచుండినవి. వేంకటరాయశాస్త్రుల వారును వారి కుమారులు వేంకటరమణయ్యగారు (రాజన్న)ను చూచుకొనుచుండుటచే గ్రంథములు సుందరములుగాను నిర్దుష్టములుగాను ముద్రితములగు చుండినవి. వేంకటరాయశాస్త్రిగారు నిరంతరము గ్రంథములు పఠించుచు, రచించుచు, ప్రూపులు దిద్దుచును, వారికుమారులు అచ్చాఫీసు వ్యవహారములను చూచుచునుండిరి.


___________