పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు ధైర్యముకలిగించిరి. మనసువిఱగునట్లు మాటలాడుట వీరిపద్ధతి గాదు - అనగా నితరపండితులపై దాడివెడలునప్పుడుతప్ప! వీరికిని మహామహోపాథ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారికిని నడచిన వాగ్యుద్ధము ఆనాటి ఆచారమునకు సరిపోయినదిగాని నేడు మనకు స్మరణయోగ్యము కాదు. వ్యాకరణాది మీమాంసలే నాటి విమర్శకవిచారములు. ఆచర్చలలో సరళము లరుదు; పరుషములే మెండు; భాష ప్రథానము, భావము కాదు. పరుషవాక్యములను తీసివేసినయెడల శాస్త్రులవారి విమర్శనము మనకెల్ల భాషాజ్ఞానమును విస్తరించిన వరప్రసాదము.

వీరికిని శ్రీ సమర్థి రంగయ్యసెట్టిగారికిని పరస్పరహితభావ మెక్కువ. సెట్టిగారు ఉపభాషావిద్యలకు విచారణకర్తలు; ఒక విధముగ శాస్త్రులవారికి యజమానులు. వారును మృదుహిత సరసవాక్ప్రగల్భులు. విద్యార్థులను సంబోధించునప్పుడు 'న' కారప్రయోగ మెన్నడును చేసినవారుకారు ;మీరు', 'దయ చేయండి', 'తమవిషయ మెఱుగుదును' ఇత్యాదిరీతుల మమ్ము మన్నించువారు. అట్టి తరుణముల మామనస్సులందు స్వచ్ఛందముగ జనించు వినయము, సిగ్గు, పూజ్యభావము, ఇట్టిట్టివని చెప్పగాదు. శ్రీ సెట్టిగారును శాస్త్రులవారును విద్యార్థులను మంచిమార్గములకు ప్రేరేపించు సహజశక్తి గలవారు. ఆచార్యుల కుండవలసిన యుత్తమగుణములలో నిదియొకటి. ఈకళయందు వీరిరువురును అసామాన్యులు.