పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు.

ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.

ప్రిన్సిపాలుదొరకు బదులుచెప్పుటకు ఏమియు తోచలేదు. 'సరే, శాస్త్రులవారూ, అయితే మీపని మీరుచూచుకొండి.' అనెను.

శాస్త్రులవారు తమపనికి తాముపోయిరి.

వేసవికాలమున నొకదినమున తరగరిలో విద్యార్థియొకడు, శాస్త్రులవారు పాఠము చెప్పుచుండగా నిద్రబోవుచుండెను. దొర ఎచటినుండియోవచ్చి, శాస్త్రులవారి యనుమతిలేకయే వారిగదిజొచ్చి, ఆవిద్యార్థినిలేపి, శాస్త్రులవారినిచూచి Do you allow the boys to sleep in the class? అని యడిగెను. (విద్యార్థులను తరగతిలోనే నిద్రబోనిచ్చెదవా? అని యర్థము.)