పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15-ప్రకరణము

క్రిశ్చియన్కాలేజి సంస్కృతపండితపదవినుండి విరామము

శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత ప్రథానపండితులుగాను శ్రీ సమర్థి రంగయసెట్టిగారి మరణానంతరము కాలేజిలో ప్రాచ్యభాషా ప్రవచనాధ్యక్షులుగాను (Superintendent of Vernacular studies) దాదాపు ఇరువదినాలుగు సంవత్సరములుండి 1910 సంవత్సరమున జనవరినెలలో విరమించిరి. ఈ ఇరువదినాలుగు సంవత్సరములలోను మదరాసురాజథానిలో సుప్రసిద్ధు లెందరో వారికడ సంస్కృత మభ్యసించిరి. శాస్త్రులవారు మొదటమొదట కళాశాల ప్రవేశించినకాలమున, మా నెల్లూరునగర న్యాయవాది శిఖామణులలో నొకరును చరిత్రపరిశోధకులు నగు శ్రీ వంగవోలు వేంకటరంగయ్య పంతులవారు ఆకళాశాలలో నింటర్మీడియేటు మొదటితరగతియందు చదువుచుండిరి. శాస్త్రులవారు వచ్చిన వెంటనే శుక్రనీతి మొదలైన పలువిషయములంగూర్చి చెప్పవలసివచ్చినదట. తరగతికి వలసినవిషయములను పూర్వపరిశోధన లేకయే శాస్త్రులవారు, చాలసులువుగా, ఆయాగ్రంథభాగములను, తమకు ముందే కఠస్థములైనవానింబోలె చెప్పుచు విద్యార్థులకు తొలిదినముననే తమయందు ఆశ్చర్యగౌరవములం గలిగించిరని శ్రీ పంతులవారే నాకుచెప్పియున్నారు. అప్పటికే శాస్త్రులవారికి గీర్వాణవాఙ్మయమున పెక్కువిషయములు కంఠస్థములు.