పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1899 సం. జనవరి 1 తే. 12 ఘం. లకు సభ యారంభమాయెను. కుప్పుస్వామయ్యగారు నూతనమార్గముల గ్రంథములు రచింపవలసినదనియు, అన్యభాషాగ్రంథముల నాంధ్రీకరించుచో సాంకేతికపదములను గీర్వాణభాషలో.......నాటకములందు గ్రామ్యము ప్రయోగింపగూడదనియు నుపన్యసించిరి. వేంకటరత్నము పంతులవారు...... నాటకములలో గ్రామ్య ముపయోగింపగూడదని నుడివిరి.

పిదప నాత్మకూరు సంస్థానపు శ్రీనివాసాచార్యులవారు నాటకములలో గ్రామ్యముకూడుననియు కూడదనియు రసమునకు గ్రామ్యమే వలయుననియు నుడివిరి......

ఈ యుపన్యాసము లిట్లు జరుగుచుండగా సామాజికులు అగ్రాసనాధిపతిగారికి ముమ్మాఱు ఒకవిన్నపము, తొలుత ఒకరిద్దఱి చేవ్రాలతోను, రెండవమాఱు మూడవమాఱును పలువురి చేవ్రాలతోను ఒనర్చిరి. విజ్ఞాపననంగీకరించి అగ్రాసనాధిపతిగారు వేంకటరాయశాత్రిగారిని ఉపన్యాసార్థమై పిలిచిరి. శాస్త్రులవారప్పుడే యింటికి పోయివచ్చినందున, దేహమందారోగ్యము చాలనందునను, తన్ను మన్నించి యుపన్యాసము తప్పింపవలయునని అగ్రాసనాధిపతిగారినియడిగిరి. 'మీరు నాలుగుమాటలుచెప్పిన చాలును. ఏవిషయముచెప్పినను సరియే" యని రెండుమాఱులు అగ్రాసనాధిపతిగారు కోరగా మహానుభావులమాట నిరాకరింపజాలక యొడంబడిరి. అగ్రాసనాధిపతిగారు లేచి 'మహావిద్వాంసులైన వేదము వేంకటరాయశాస్త్రిగా రుపన్యసించెదరు. సావధానచిత్తులరైవినుడు.' అని సభవారిని హెచ్చరించి పల్కిరి శాస్త్రిగా రుపన్యాసపీఠము నధిష్ఠింపగానే సభ్యుల కరతాళఘోషములు 4-5 నిమిషములు మ్రోగుచుండినవి. (ఇట్టి గౌరవము, అగ్రాసనాధిపతిగారి చేతనేమి, సామాజికులచేతనేమి శాస్త్రిగారికిదక్క మఱియేయుపన్యాసకునికిం జరుగలేదు.) ఆఘోషలు నిలిచినతర్వాత, శాస్త్రులవారు అగ్రాసనాధిపతిగారిని ప్రకృతవిషయమేమని యడిగిరి. కృతివిమర్శోప సంఘనిర్మాణమని యగ్రాసనాధిపతిగారు చెప్పిరి.