నవ్వలేరు. అట్టివారిని జూచి సామాన్యజనము భయపడుట, యసహ్యించుకొనుటయు సహజము.
శరీరమునకును నవ్వునకును సన్నిహిత సంబంధమున్నది. నవ్వు శారీరకమని నమ్మిన శాస్త్రజ్ఞులు నున్నారు. సాంఘికాంగీకార మననేమో యెఱుఁగని పసికందులు కపోలముల ముట్టినంతనే పెద్దపెట్టున నవ్వుదురు. ఇది నవ్వు శారీరకమని వాదించు వారికిఁ బ్రబలబలము. సంఘమువలనఁ గలుగు బాధలనుగాని, తదితరములైన వ్యక్తిగతబాధలనుగాని యపనయించుట నవ్వు సహజముగఁ జేయు పనికాదని వీరి వాదము.
అయిన వారు మానవుఁడు బాధను బోగొట్టుకొనుట కొకసాధనముగ నవ్వు నుపయోగించుకొనుచున్నాఁడను నంశమున నితరులతో నేకీభవింతురు. మానవుఁడు నవ్వను సాధనమునకు సురమ్యమగు రూపమును సృష్టించి దానికిఁ గళాత్మకమగు జీవనమును బోసి వివిధరీతులలో నుపయోగించు చున్నాఁడు. అందువలనఁ బ్రపంచమున వివిధదేశముల వివిధ సాంస్కృతిక ప్రవృత్తులలో నున్న మానవునకు సాధనమైన నవ్వును ననంతరూపముల నొందినది. ఒక్కొక్క విభేదమొక్కొక్క జాతికిఁ బ్రాణము పోయుచున్నది. నవ్వు ప్రాణినుండి ప్రాణికిఁ బ్రాకు నంటువ్యాధియైనను నా విభేదము నచ్చకున్న వ్యక్తి నవ్వఁడు.
ఇతరులు నవ్వుట వినినను, కనినను సామాన్యవ్యక్తి యా ప్రవాహమునఁ బడి యందు బాల్గొనును. ఉత్తముఁడు, సుఖి పెద్దపెట్టున నవ్వడు; చిఱునవ్వులఁ జిలుకరించును; అందముగ నధరాస్ఫాలన మొనర్చును. కనీనికల మిలమిలలతోఁ దనకుఁ గలిగిన కమనీయానందమును వెల్లడిచేయును.
అందఱు గాఢముగనో లేక గూఢముగనో నవ్వగలరు. కాని యందఱును నవ్వింపఁజాలరు. ఇందుకుఁ జతురులు కాని వారు నిష్ప్రయోజకులు. తాను నవ్వులపాలగుచు నితరుల నవ్వింపఁగల నేర్పు హాస్యరసప్రియున కున్నది. ఉత్తమహాస్యరసజ్ఞుఁడు వికారరూపముల ధరించి వికృత చేష్టలనొనర్చి యితరులు నవ్వింప యత్నింపఁడు. వికారముల వలనఁ గలుగునవ్వు నవ్వుకాదు. కేవల వికారములసహ్యకరములు. సరసోక్తి, నర్మోక్తి, ఛలోక్తి - ఇత్యాది విశేషోక్తుల నుత్తమరసికుఁడై హాస్యరసప్రియుఁడితరుల కానందామృతమును బంచిపెట్ట యత్నించును. సంఘమునందలి లోపముల శక్తిమంతమైన తన చతురహాస్యములతో
94
వావిలాల సోమయాజులు సాహిత్యం-4