నవ్వు
'నవ్వు నాలుగందములఁ జేటు’ ఈ వాక్య మేనాఁడు పుట్టినదో! ఏ సందర్భమునఁ బుట్టినదో!! దీనివలన నవ్వవలదని మన వారి యనుశాసనము కాదు. 'బాలసఖత్వమ కారణ హాస్యం స్త్రీషువివాద మసజ్జన సేనా... షట్సు వరోలఘుతా ముపయాతి' అనిన నీతి వాక్యము వలన నకారణ హాస్యము ప్రమాదకరమైనదని యార్యులు పరిగణించిన ట్లర్థమగుచున్నది. బాలురతోఁ జెలిమి, కారణము లేని నవ్వు, స్త్రీలతో వాదులాడుట, జనసేవ, గార్దభయానము, సంస్కారవిరహితమైన భాష - యీ యారును మానవుని, జులుకనఁ జేయునఁట!
ఇతరములైన యైదింటి మాట యెట్లున్న నవ్వుమాట నమ్మఁదగినది. ప్రాకృతులు కొందఱు పెద్దపెట్టునఁ గారణవిరహితముగ నవ్వుచుండ వారిపై నర్థముగాని జాలిగలుగుట సహజము. దాని పర్యవసానమొక చిఱునవ్వు. భరింపరాని దుఃఖము ప్రౌఢమైన హాస్యముగ మారునని తాత్త్వికుల యభ్యూహము. ఈ కారణముననే మహాకవి బైరను 'నేనే ప్రాణిని గూర్చియైన నవ్వితినన నది యేడువలేక' యని యొక సందర్భమునఁ బలికినాడు.
జంతుకోటి దుఃఖ సమయముల నేడ్వగలవు; కాని సంతోష సమయముల నవ్వఁ జాలవు. సమస్త చరాచర ప్రకృతియందును నవ్వఁగలిగినది మానవుఁడొక్కడే. ఇతఁడొక్కఁడే యేల నవ్వఁగలుగుచున్నాఁడని ప్రశ్నించుకొని నీచే యను జర్మను తాత్త్వికుడు "లోకమున నతనివలె బాధపడు ప్రాణి మఱియొకటి లేదు కనుక" అని సమాధానము చెప్పుకొనినాఁడు.
ఇతర ప్రాణి లోకముకంటె మానవుని యాధిక్యమును నిరూపించు నుపపత్తులలో నవ్వు గణనీయము. ఇది మానవజాతికి సర్వసామాన్య మయ్యును దీని తత్త్వము నొక జాతివారు గమనించినట్లు మఱియొక జాతివారు గుర్తింపలేరు. చైనా జాతివారు చెడువార్త వినినపుడు చింతించుటకుఁ బ్రతిగ నవ్వెదరఁట! మరణవార్తలు వినినపుడు మిథ్యావిషాదమునైన బ్రకటింప వలసియుండ బంధువర్గములకు శవపేటికల నిచ్చి బహూకరించుచు విలాసములఁ దేలి యాడెదరఁట!! రష్యను జాతివారు తమ్ముఁ దాము పరిహాసమొనర్చుకొనఁ గలరఁట!! ____________________________________________________________________________________________________
వావిలాల సోమయాజులు సాహిత్యం-4