కులాసా కబుర్ల పరిణామంగా 'ప్రేమ వసంతమూ, పెళ్ళి గ్రీష్మమూ' అని అనేక
గోష్ఠుల్లో తేలిపోతున్నట్లునూ ప్రత్యేక విలేఖర్లు పదే పదే వ్రాస్తున్నారు.
లోకంలో ఇతరుల ప్రణయ, ప్రళయాలూ, ఆశనిరాశలూ, పాండిత్యా పాండిత్యాలూ, భయభక్తులూ కులాసా కబుర్లకు వస్తు విశేషాలు చెప్పేవారికి, త్రినయనాగ్నికి 'త్రిపురాలూ' దహించుకో పోవలసినదే. అనేక మాట్లు అతగాడొక్కడే ‘స్వయం వ్యక్తి'గా శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వరుడివలె కొండమీద నిలిచిపోతాడు. ఇతరులెంతెంత వారూ 'ఇంద్రాదు' లౌతారు. వారు ఉత్తమానుత్తమాన్ని గానీ, పవిత్రతా పవిత్రతలను గానీ పాటింపని 'పరమా ద్వైతులు'. వీరివల్ల బాధపడ్డ ఒక జిజ్ఞాసువు అనాలోచితంగా అన్నాడు : 'కులాసా కబుర్లను చెప్పేవాళ్ళనూ, వినేవాళ్ళనూ శిక్షించే అవకాశమే నాకుంటే, ఒకరి నాలుకను - వక్త గనక - చిల్లి పొడిపించి చెట్టుకు కట్టిస్తాను; ఒక కర్ణ రంధ్రానికి తాడు కట్టించి ఏటవాళ్ళ కొండకొమ్మునుంచీ క్రిందికి జారవిడిపిస్తా' నన్నాడు. అటువంటి స్థితి వచ్చినా గట్టి న్యాయవాదులుంటే, ఈ 'అన్న వ్యక్తి' ముందు తన్ను తానే శిక్షించుకొని తరువాత ప్రతివాదులను శిక్షించేటట్లు అంగీకారం ఇప్పించవలసిందని కోర్టువారిని కోరి, అంతంలో అనంత దిగ్విజయం పొందగలరని నమ్మవచ్చు. ఈ వ్యసనానికి ఎప్పుడో ఒకప్పుడు పాలుగాని వాడుండడు. అందువల్ల ఇటువంటి 'అవకాశాన్ని' ఏ 'అభ్యుదయుడూ' కోరడు. ఇది నిశ్చయం.!
మంచి చెడ్డలమాట అలా ఉంచితే కబుర్లు చెప్పటం మటుకు అందరికీ చేత నౌతుందనుకోటం పొరబాటు. సహజ ప్రతిభతో పాటు వ్యుత్పన్నత ఉండి తీరాలి. కులాసాగా కబుర్లు చెప్పటమూ ఒక కళ. కళలు 'కాంతా సమ్మితాలు' అనంతాలూ అత్యద్భుతాలూ ఆనంద ప్రదాలు 'ఓమ్... తత్... సత్'
ఆంధ్రపత్రిక జనవరి 5, 1948
840
వావిలాల సోమయాజులు సాహిత్యం-4