అని యజ్ఞకర్తల నిందించినాఁడు. పూజాదులకు మూలకర్తలైన బ్రాహ్మణులకు బ్రహ్మము నలుపో తెలుపో తెలియదనినాఁడు. సంఘదుఃస్థితికి వారిని బాధ్యులను గావించి బ్రాహ్మణులు ప్రబలులై యుండగా నితర జాతులకు గతులు లేవనినాఁడు. ఇవి తత్త్వదృష్టి, ధర్మబుద్ధి, న్యాయాభిమానములతో పల్కిన మాటలు గాని, నేఁటి బ్రాహ్మణేతరులకు వలె నసూయతోఁ బలికినవి కావు. కావుననే వేమన -
"జ్ఞాన మొసఁగి జనులఁ గడతేర్పఁ గలుగుచో
బ్రాహ్మణులకు సకల భాగ్యములీవచ్చు”
ననినాఁడు. అట్టి గుణములేని బ్రాహ్మణులకుఁ బెట్టినను, కుక్కకుఁ బెట్టినను ఒక్కటియే యనినాఁడు. ద్విజులే శూద్రుఁడైన తన్ను కోటానుకోట్లుగ కొల్చిరని చెప్పుకొనినాఁడు. నిజము కావచ్చును. నేడును నిష్కల్మషముగా అబ్రాహ్మణుఁడైన గాంధీ మహాత్ముని గొల్చువారిలో బ్రాహ్మణులే ఎక్కువ గదా!
మానవునకు మృత్యుచింత మనమైనది. ఎవరికిని చావు తప్పనిదని గమనించిననాఁడు, “చావు దెలియలేని చదువేటి చదువురా!" యని సంసారపుముడిని విడదీయుటకు యత్నించినాఁడు. ఈ చిక్కును గూర్చి పలుకుమని పలుమారులు భగవంతునితో మొఱ వెట్టినాఁడు. ప్రయోజనము లేక విసిగినపుడే, వేమనకు రసవాదవిద్యాభ్యాసము నందలి అభిరుచితో యోగుల పరిచయము గలిగినది.
సామాన్యులైన అద్వైతులు ద్వైతులుగానే నిలిచిపోవ, అద్వైతతత్త్వ మెఱుగుటకుఁ గొంద అరణ్యములను బట్టిపోయిరి. వీరే యోగులు. అద్వైతమున మన దేశమున శ్రీవైష్ణవము, వీరశైవము, శాంకరము అను మూడు భేదములున్నవి. శ్రీవైష్ణవా ద్వైతమునకు, యోగమునకు సంబంధము లేదు. శంకరుల యద్వైతమునకు, యోగమునకు విశేష సంబంధమున్నది. ఇందు మోక్షస్థితిని సాధించుటకు యోగము నాశ్రయింపవలసి యున్నది. అద్వైతానుభవవిషయమున శ్రీవైష్ణవులకును, శంకర మతానుయాయులకు మధ్య నున్నవారు వీరశైవులు. వీరికి శివసాయుజ్య మొందుటకు వలయు నఖండభక్తికి సాధనమైనది యోగము. ఇట్టి యోగ మనుభవించువారు శివయోగులు. అద్వైతము బ్రాహ్మణేతరులలో వ్యాప్తినొందినది. బ్రాహ్మణులు కర్మప్రధానులు. వీరిలో సన్యాసులైనను కర్మలకన్న నధికమైన పూజాదికము లొనర్పవలయును. కావున అద్వైతబ్రాహ్మణులలో యోగులు లేరు. వీరశైవులకు నిత్యకర్మలు లేవు. వీరు అఖండభక్తికై యోగము నాశ్రయించినారు. కొందఱు
812
వావిలాల సోమయాజులు సాహిత్యం-4