తత్త్వదృష్టి గలవారు ఉన్నారనుటకు “భూమిలోన పుణ్య పురుషులు లేకున్న జగములేల నిల్చు పొగులుఁగాక” అన్న వేమన వాక్యమే నిదర్శనము. ఇది వేమననాఁటి సంఘస్థితి.
వేమన శైవముపై ప్రీతిగల కుటుంబము లోనివాఁడు. బ్రాహ్మణులలోఁ గాక యితరజాతులలో వ్యాప్తిఁజెందిన వీర శైవమునకు సంబంధించినవాఁడు. వీరశైవము జాతిభేదమును తిరస్కరించుచు పుట్టినను, మఱియొక నూతనజాతిని సృష్టించి నిలిచిపోయినది. ఇది గాని, చుట్టును ప్రబలియున్న వైష్ణవముగాని, విచారణ చేసిగాని నమ్మని వేమనకు తృప్తినీయలేకపోయినవి. వేమన పురాణపురుషులైన రామాదులను భగవదతారములని నమ్మఁడు.
"కనకమృగము భువిని కద్దు లేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరథియు
తెలివిలేనివాఁడు దేవుఁ డెట్లాయెరా?”
అని ప్రశ్నించినాఁడు. "ధ్యానములను శివుని ధ్యానమే శ్రేష్ఠంబు” అని సంప్రదాయానుసారముగఁ జెప్పినను, శివునిఁ గూడ నితఁడు సర్వశక్తునిగ తలపఁలేదు.
"కంటిమంటచేత కాముని దహియించి,
కామమునను తుదకు గౌరిఁ గూడె
ఎట్టి వారినైనఁ బట్టు ప్రారబ్ధంబు”
అని శివుని చులకన చేసినాఁడు. "కొడుకును బ్రతికించు కొనలేదు శంభుఁడు” ఇత్యాది యందు శివునికంటె కొడుకును బ్రతికించుకొన్న విష్ణువే ఘనుఁడని పలికినాఁడు.
బసవభక్తులు పాపులని, లింగధారికన్న దొంగలు లేరని, వైష్ణవులు ప్రజలను భ్రష్టులొనర్తురని పల్కి, శైవవైష్ణవ భక్తుల దాంభికవృత్తి నసహ్యించుకొనినాఁడు. ఇట్టివారి యాజమాన్యమున నడుచు పూజలు, యజ్ఞములు, యాత్రలు మొదలైనవానిని వేమన “రాతిబొమ్మ కేల రంగైన వలువలు” ఇత్యాదులందు తిరస్కరించినాఁడు.
“లంజకొఱకు మేకనంజుఁడు తినసాగ
యజ్ఞమెల్ల కామయజ్ఞమాయె,
మొదట సోమయాజి తుది కామయాజిరా!"
సాహిత్య విమర్శ
811